విద్యార్థులతో చెలగాటమొద్దు
* తీరు మారకుంటే ఉద్యమిస్తాం: ఆంజనేయగౌడ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యం చేయడం ద్వారా తెలుగు విద్యార్ధులకు తీరని నష్టం చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుట్రలు చేస్తున్నారని తెలుగునాడు విద్యార్థి సంఘం జాతీయాధ్యక్షుడు ఆంజనేయగౌడ్ విమర్శించారు. 1956 నిబంధన విధించడం బీసీ విద్యార్థుల గొంతు కోయడానికేనని దుయ్యబట్టారు.
ఈనెల 8న కలెక్టర్లకు వినతిపత్రాలు, 11న ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, 13న రౌండ్‌టేబుల్ సమావేశాలు, 18న కలెక్టరేట్ల ముట్టడి చేయాలన్నారు. సోమవారం టీఎన్ఎస్ఎఫ్ జాతీయకమిటీ సమావేశమై ఈ అంశాలపై చర్చించింది. సమావేశంలో ఇరు రాష్ట్రాల అధ్యక్షులు బ్రహ్మం చౌదరి, మధుసూదన్‌రెడ్డితో పాటు రాజేష్, రవినాయుడు, సురేష్‌నాయక్, రమేష్ ముదిరాజ్, శ్యామ్‌సుందర్ శేషు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో టీడీపీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడానికి ఈ నెల 21న నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మేధోమథన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంజనేయగౌడ్ తెలిపారు.