సీపీఐ నుంచి రవీంద్ర బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో చేరనున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌నాయక్‌ను సీపీఐ బహిష్కరించింది. ప్రజలు ప్రత్యేకించి అణగారినవర్గాలకు అండగా ఉంటానని వాగ్దానం చేసి తుచ్ఛ అధికార దాహానికి, ఆర్థిక ప్రలోభాలకు లొంగినందుకు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీకి ఓటేసిన దేవరకొండ నియోజకవర్గ ఓటర్లను మన్నించాలని కోరింది. అలాగే పార్టీ టికెట్‌పై గెలిచిన రవీంద్ర ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. టీఆర్ఎస్లో చేరనున్నట్లు రవీంద్ర నాయక్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం సోమవారం అత్యవసరంగా సమావేశమై ఎమ్మెల్యేపై వేటు వేయాలని నిర్ణయించింది.
పార్టీకి, ఎన్నుకున్న ప్రజలకు ద్రోహం చేసి అధికార పార్టీకి దాసోహమన్న రవీంద్రకుమార్ నాయక్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనైతిక రాజకీయ సంస్కృతికి టీఆర్ఎస్ అహంభావపూరిత, అధికార దాహానికి రవీంద్ర నాయక్ చర్య ప్రతీకగా నిలుస్తుందన్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఆయా పార్టీల సభ్యులతో రాజీనామా చేయించకుండానే పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందన్నారు. ఈ విష సంస్కృతికి ఏదో ఒకరోజు టీఆర్ఎస్ కూడా బలికాక తప్పదని హెచ్చరించారు. కాగా, పార్టీ హైదరాబాద్ (నార్త్ జోన్) కార్యదర్శి డా.సుధాకర్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు రవీంద్ర నాయక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.