బ్యాంకు షేర్లకు ఆర్బీఐ షాక్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థలో అనూహ్యంగా పెరిగిన లిక్విడిటీని నియంత్రించేందుకు తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ షేర్లకు భారీగా ప్రభావితం చేసింది. ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని తాత్కాలికంగా పెంచడంతో బ్యాంకింగ్ సెక్టార్ కి షాకిచ్చింది. మార్కెట్ల ప్రారంభంలోనే బ్యాంక్ నిఫ్టీ 273 పాయింట్లకు పైగా పతనమైంది. పీఎస్యూ బ్యాంక్ సూచీ 3 శాతం పతనంకాగా, బ్యాంక్ నిఫ్టీ కూడా 1.7 శాతం క్షీణించింది. ఆరంభంలో ఎస్బీఐ2.09 శాతం, ఐసీఐసీఐ 1.86శాతం, హెచ్ డీఎఫ్సీ 0.50 శాతం నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్ 1.63 శాతం, బీఓబీ 2.8శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు గత శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సీఆర్ ఆర్ పెంపుతో మదుపర్లు బ్యాంకింగ్ సెక్టార్ లో అమ్మకాలవైపు మళ్లారు.
పెద్ద నోట్ల రద్దు కారణంగా డిపాజిట్ల వెల్లువ భారీగా పెరగడంతో ఇంక్రిమెంటల్ నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)ని తాత్కాలికంగా 100 శాతానికి పెంచుతూ కేంద్ర బ్యాంకు నిర్ణయం తీసుకుంది. వివిధ బ్యాంకుల్లో కుప్పతెప్పలుగా జమవుతున్న నగదును బ్యాంకులు రిజర్వ్ బ్యాంకుకు మళ్లించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) బ్యాంకులకు ఈ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 16- నవంబర్ 11 మధ్య కాలానికి, అంటే నవంబర్ 26నుంచీ బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని తిరిగి డిసెంబర్ 9న సమీక్షించనున్నట్లు ఆర్బీఐ తెలియజేసింది.
ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను (క్యాష్ రిజర్వ్ రేషి యో) 100 శాతం పెంచినట్టు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో బ్యాంకు ల్లో భారీగా డిపాజిట్లు పెరిగి నగదు లభ్యత పెరిగినందువల్ల తాత్కాలిక చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) కింద బాండ్లను తగినంత విడుదల చేసిన వెంటనే సీఆర్ఆర్ పరిస్థితిని సమీక్షిస్తామని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.