తాడ్వాయి అడవుల్లో డోల్మన్ సమాధులు
♦ ఒక్కోటి 15 అడుగుల పొడవు, వెడల్పున్న రాతి సమాధులు
♦ రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో వెలుగులోకి వచ్చిన ప్రాచీన చరిత్ర
ములుగు: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న సూరగుండయ్య గుట్టల్లో 10 వేల ఏళ్ల కిందటి ప్రాచీన సమాధులు వెలుగుచూశాయి. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి.. తన బృందం సభ్యుడు పకిడె అరవింద్, స్థానికులు మహేశ్, లక్ష్మయ్య, హరిలాల్ సహకారంతో చేసిన పరిశోధనలో ఇవి బయటపడ్డాయి. సూర గుండయ్య గుట్ట ఆది మానవులకు ఆవాసంగా ఉండేదని, ఇక్కడ బయల్పడిన సమాధులు ఆనాటి మానవజాతి నమ్మకాలు, విలువల సాంకేతిక పరిజ్ఞానానికి ఆనవాళ్లుగా ఉన్నాయని తెలిసింది.
గుట్టకు కుడి, ఎడమ వైపులా నిరంతరం ప్రవహించే వాగు, దట్టమైన అడవి ఉండడం వల్ల ఆది మానవులకు ఆవాసంగా మారిందని ఆయన చేసిన చరిత్ర పరిశోధనలో తేలింది. సమాధి రాళ్లను తొలచి, సమాధుల నిర్మాణ ప్రాంతాలకు తరలించడం, టన్నుల కొద్దీ బరు వు ఉండే పైకప్పు బండలను వాటిపై అమర్చ డం విశేషంగా కనబడుతుంది. ఇసుకరాయితో ఏర్పడ్డ సూరగుండయ్య గుట్టను పలకలు పలకలుగా తొలచి ‘గది’లా నిర్మాణం చేశారు.
సమాధులపై ‘ఏకరాయి కప్పు బండ’లను అమర్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతి సమాధికీ ప్రవేశమార్గం ఓ మనిషి చొరబడేలా ఉంది. ఎటు చూసినా 15 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ఏకరాతి బండల సమాధులు తొలిసారి ఇక్కడే వెలుగుచూశాయి. ఈ కప్పు బండలు రెండు నుంచి మూడు ఫీట్లకుపైగా సమాన మందంతో ఉన్నాయి. చాలా సమాధుల్లో లోతు తక్కువ ఉన్న 5 నుంచి 6 అడుగుల నీటి తొట్లు ఉన్నాయి. ఒక సమాధిలో మూడు నీటి తొట్లు ఉండడం విశేషం. వీటిని డోల్మన్ సమాధులు అంటారని పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు.
మూడు రకాల్లో...
సూరగుండయ్య గుట్ట ప్రాంతంలో మూడు రకాల డోల్మన్ సమాధులు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటి రకం నేలపై, రెండవ రకం రాతిపై, మూడో రకం రాళ్లను కుప్పగా పోసి మధ్యలో సమాధి నిర్మించిన ఆనవాళ్లున్నాయి. రాతిపై నిర్మించినవి మినహా మిగతా రెండు రకాల సమాధులు దీర్ఘ చతురస్రాకారంలో నిలబెట్టి ఉన్నా యి. ప్రాచీన ఆదిమానవుల సమాధుల్లో ఉన్న శిలువాకృతులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గతంలో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిలువ ఆకృతి సమాధి బయటపడింది. అయితే దామరవాయిలో కేవలం శిలువాకృతులు సమాధిపై పెట్టడానికి మాత్రమే అన్నట్లుగా ఉపయోగించబడ్డాయి.
రెండు రాళ్ల కుప్పలపై నిర్మించబడిన డోల్మన్ సమాధుల మధ్య విరిగి పోయి ఉన్న శిలువాకృతులు 4 అడుగుల పొడవున కనిపిస్తాయి. అనేక శిలువాకృతులు బండను తొలిచినట్లుగా ఉన్నాయి. అప్పటికే అక్కడ నివసించిన జాతి వలసపోవడం, బలహీనపడి అంతరించిపోవడం లాంటివి జరిగి ఉండవచ్చని ఈ పరిశోధకుడి అంచనా. శిలువాకృతులు ఏసుక్రీస్తు శిలువను పోలి ఉన్నాయి. ఇవి క్రీస్తుపూర్వం నాటివని పరిశోధకుడు తెలిపారు. సమాధులపై పురావస్తు శాఖ సమగ్ర అధ్యయనంచేసి పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకొస్తే.. పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి సమాధుల లెక్కను తేల్చి, ఆది మానవుల సంప్రదాయ పనిముట్లను బయటి ప్రపంచానికి తెలిసేలా కృషి చేయాలని పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి కోరారు.