కేరళ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి లిబియాలో అపహరణకు గురయ్యాడు. కాజీకోడ్ జల్లాకు చెందిన రేగి జోసెఫ్ (43) ను లిబియా రాజధాని ట్రిపోలి లో అక్కడ తిరుగుబాటు దళాలు గతనెల 31న కిడ్నాప్ చేశారు. రాజధానికి సమీపంలో సోక్ అల్ జముయా కార్యాలయంలో విధులు నిర్వర్తిసుండగా దాడిచేసిన ప్రభుత్వ వ్యతిరేక దళాలు జోసెఫ్ తో పాటు మరో ముగ్గుర్ని అపహరించారు.
జోసెఫ్ ఆల్ దివాన్ కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. భార్య షినుజ, ముగ్గురు కుమార్తెలుతో గత రెండు సంవత్సరాలుగా ఆయన లిబియా నివసిస్తుండగా, భార్య స్థానిక టిఎంసి హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తున్నారు. కాగా తన కుమారుడు కిడ్నాప్ వ్యవహారంపై తన కోడలు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్టు జోసెఫ్ తండ్రి పుల్లు వెలిల్ తెలిపారు.
మరోవైపు కాజీకోడ్ ఎంపీ ఎంకె రాఘవన్ స్పందిస్తూ జోసెఫ్ కుటుంబానికి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.