భార్య కోసం.. సెల్‌టవర్ ఎక్కాడు
శంకరపట్నం(కరీంనగర్): పది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు తన భార్యను పుట్టింటి వారు తీసుకెళ్లడంతో.. మనస్తాపానిక గురై భార్యను కాపురానికి పంపకపోతె ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములమూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేగుల అరుణ్‌కు పది రోజుల క్రితం ఇదే మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వివాహం జరిగింది. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో.. ఆమె ఇష్ట ప్రకారం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అరుణ్‌ను వివాహమాడింది. ఈ క్రమంలో పెళ్లైన వారం రోజుల తర్వాత యువతి తల్లిదండ్రులు ఆమె వద్దకు వచ్చి ఆమెను తమ వెంట తీసుకెళ్లారు.
అప్పటినుంచి తిరిగి కాపురానికి పంపకపోవడంతో.. మనస్తాపానికి గురైన అరుణ్ గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కాడు. తన భార్యను కాపురానికి పంపకపోతె ఇక్కడి నుంచి దూకి చస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు.