‘కళ’తప్పిన బతుకులు
=సురభి నాటకాలకు తగ్గిన ఆదరణ
= కళాకారుల భవిష్యత్ ప్రశ్నార్థకం
= అంతరిస్తున్న నాటక బృందాలు
అద్భుత సహజ హావభావాలు.. స్పష్టమైన వాక్పటిమ.. సంభాషణ సంవిధానం.. రాజసం ఉట్టిపడే నటన.. సురభి కళాకారులకే సొంతమైన ఆభరణాలు. పేరులోనే దేవతలను చేర్చుకున్న వీరు నటనామృతం సేవించి నాటకాల్లో అమరత్వం పొందారు. తమ నటనా వైదుష్యంతో ప్రేక్షకులను కట్టిపడేసి విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నాటక సమాజంలో తమకంటూ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న సురభి కళాకారులు నేడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆధునిక సమాజంలో నిరాదరణకు గురవుతూ సరైన నాటకాలు లేక నానా కష్టాలు పడుతున్నారు.
పామర్రు, న్యూస్‌లైన్ : తొలుత సురభి నాటకాన్ని శ్రీకమలానంద నాటక సమాజంగా వ్యవహరించేవారు. తర్వాత ద శలో శ్రీవినాయక నాట్యమండలి(సురభి)గా రూపాంతరం చెందింది. దీనిని పనారస గోవిందరావు 1885లో స్థాపించారు. కడప జిల్లాలోని సురభి గ్రామం లో సుమారు వందేళ్ల కిందట శ్రీవినాయక నాట్యమండలి ఏర్పడింది. అప్పుడే పలువురు కళాకారులు సుమారు 40 బృందాలుగా ఏర్పడి దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వివిధ నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఆధునిక సమాజంలో తమ నాటకాలకు ప్రోత్సాహం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని శ్రీవినాయక నాట్యమండలి కార్యదర్శి రేకందార్ వేణుగోపాలరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.
తొలి తెలుగు టాకీ మూవీలో సురభి కళాకారులు
తొలి తెలుగు టాకీ మూవీ ‘భక్తప్రహ్లాద’లో సురభి సంస్థ సభ్యులైన కృష్ణాజీ, మునిపల్లిరాజు, సురభి కమలాభారుు ప్రధాన పాత్రలు పోషించారు. తొలి గ్రామఫోన్‌ను సురభి కుటుంబ సభ్యులైన పాపాభాయి, వెంకూభాయి పాడారు.
ప్రభుత్వం ఆదుకోదూ..
ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన సురభి నాటకాలు ఇప్పుడు అక్కడక్కడ అడపదడపా మాత్రమే ప్రదర్శితమవుతున్నాయి. ఈ కళకు ఆదరణ కరువై అంతరించి పోవడంతో కళాకారులకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇతర వృత్తుల్లో రాణించలేక కళాకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వీరిని ఆదుకోలేదు.
విశ్వ కళా మహోత్సవంలో విశేష ఆదరణ
స్థానిక గగన్‌మహల్ ఎదురుగా నిర్వహిస్తున్న విశ్వ కళా మహాత్సవాల్లో ప్రదర్శిస్తున్న సురభి నాటకాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈనెల 29 నుంచి ఆదివారం వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇప్పటివరకు శ్రీకృష్ణలీలలు, బాలనాగమ్మ, భక్తప్రహ్లాద, మాయూబజార్, శ్రీనివాస కల్యాణం నాటకాలు నిర్వహించారు. చివరిగా పాతాళభైరవి నాటకాన్ని ఆదివారం ప్రదర్శించనున్నారు.
వైఎస్ వల్లే గుర్తింపు
కళలకు, కళాకారులకు గుర్తింపు తెచ్చింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తినేందుకు తిండి లేక నిరాదరణకు గురైన సమయంలో వైఎస్ మా కులాన్ని బీసీ(బీ)లో చేర్పించి అండగా నిలిచారు. మాకు ఆదరణ కల్పించారు.
- రేకందార్ వేణుగోపాలరావు, శ్రీవినాయక నాట్యమండలి (సుర భి) కార్యదర్శి