లక్ష్యం చేరువైంది..మాతృమూర్తి దూరమైంది
♦ పర్వతారోహణ విద్యార్థికి మాతృవియోగం
♦ తల్లి మరణించిన 20 రోజులకు ఇంటికి చేరిన వెంకటేశ్
నెన్నెల : ఆ విద్యార్థి ఇటీవలే హిమాలయూల్లోని రెనాక్ పర్వతాన్ని అధిరోహించాడు. నిరుపేద కుటుంబం నుంచి ఈ ఘనత సాధించి జిల్లాకు, రాష్ట్రానికి కీర్తి సాధించాడు. కానీ ఇదే సమయంలో అతడి తల్లి మరణించింది. ఇది తెలిస్తే కొడుకు ఎక్కడ తన లక్ష్యం చేరుకోడేమో అని తండ్రి, కుటుంబసభ్యులు విషయం దాచి పెట్టారు. తాను సాధించిన ఘనతను తల్లితో పంచుకోవాలని ఆత్రుతగా స్వగ్రామానికి చేరుకున్నాడు. కానీ, తన తల్లి అంతకుముందు 20 రోజుల క్రితమే మరణించిందని తెలిసి తీవ్రంగా రోదించాడు. ఈ హృదయ విదారక సంఘటన గ్రామస్తులనూ విషాదంలో ముంచింది.
ఇంటికొచ్చేదాకా తల్లి లేదని తెలియదు..
ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలో మెట్పల్లి గ్రామానికి చెందిన దళిత కుటుంబంలోని ఓరెం వెంకటేశ్‌కు సిర్పూర్(టి) గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి రాజ లింగు గ్రామ సుంకరి. తల్లి రాజేశ్వరి కూలి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పేదరికం వెం టాడుతున్నా, ధైర్యసాహసాలు ప్రదర్శించడం లో వెనుకంజ వేయలేదు. గురుకుల పాఠశాల అధికారుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హిమాలయాల్లో సాహసయూత్రకు సాహస బృందంతో కలసి నవంబర్ 10న వెళ్లాడు. 4 రోజుల క్రితం మౌంట్ రెనాక్ శిఖరం అధిరోహించాడు. అతడు సాహసయాత్రలో ఉండ గానే తల్లి రాజేశ్వరి నవంబర్ 25వ తేదీన అకస్మాత్తుగా కన్నుమూసింది. ఈ విష యం వెంకటేశ్‌కు తెలియనీయలేదు. ఈ నెల 13న రాత్రి సొంత మెట్‌పల్లికి చేరుకున్న వెంకటేశ్ తల్లి మృతి విషయం తెలుసుకుని విలపించాడు.