6న అంధుల ‘5కే వాక్’
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మిణుగురులు’ సినిమా బ్యానర్ రెస్పెక్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 6న నెక్లెస్‌రోడ్డులో అంధుల ‘5కే వాక్’ నిర్వహించనున్నట్లు సినిమా నిర్మాత అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి తెలిపారు. గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెస్పెక్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో అంధులకు చేయూత అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
సోమవారం ఉదయం 8 గంటలకు ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్డులో ఈ వాక్ ఉంటుందని, ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు హాజరవుతున్నట్టు ఆయన చెప్పారు. విశిష్ట అతిథులుగా హీరోయిన్ శ్రేయశరన్, దర్శకుడు శేఖర్‌కమ్ముల పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అయోధ్యకుమార్ వివరించారు. ఈ సమావేశంలో శ్రవణ్ కుమార్, ఈవెంట్ కో ఆర్డినేటర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.