చంద్రబాబు, కేఈల మధ్య భగ్గుమన్న విభేదాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 22 మంది రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ, వారిలో కొందరికి పదోన్నతులు ఇస్తూ ఉప ముఖ్యమంత్రి అనుమతితో రెవెన్యూ శాఖ మంగళవారం నాడు 872, 873, 874,876 జీవోలను జారీ చేసింది. అయితే, వాటన్నింటినీ అబెయెన్స్లో పెడుతున్నట్లు తాజాగా బుధవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం కొత్తగా 888 నెంబరు జీవో జారీచేసింది. పాత జీవోలు జారీచేసి 24 గంటలు కూడా గడవక ముందే వాటిని తుంగలో తొక్కేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. ఇంతకుముందు కూడా ఇలాగే కేఈ కొంతమందిని బదిలీ చేయగా వాటిని సీఎం నిలిపివేశారు. ఇక తాజా బదిలీల నిలిపివేత విషయంలో లోకేష్ జోక్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేఈ కృష్ణమూర్తికి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే కట్టబెట్టారు గానీ, ఆయన శాఖకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి భూసమీకరణ, భూసేకరణ లాంటి అంశాల్లో ఎక్కడా కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా చేశారు. తనతో సమానమైన సీనియారిటీ ఉన్న కేఈ కృష్ణమూర్తిని పూర్తిగా పక్కన పెట్టేశారు. భూసేకరణ నోటిఫికేషన్ విషయంలో కూడా ఆయనకు ఏమాత్రం చెప్పలేదని అంటున్నారు.