‘రేయికి వేయి కళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్: రేయికి వేయి కళ్లు
నటీనటులు: అరుళ్‌నిధి స్టాలిన్, అజ్మల్,మహిమ నంబియార్, ఆనంద్ రాజ్, జాన్ విజయ్, ఆడుకాలమ్ నరేన్ తదితరులు
దర్శకత్వం : ము మారన్
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ:అరవింద్ సింగ్
ఎడిటర్: సాన్ లోకేష్
విడుదల తేది: సెప్టెంబర్ 30, 2022(ఆహా)
ప్రస్తుతం ఓటీటీ వినియోగం ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. ఏ భాషలో మంచి చిత్రం వచ్చినా కూడా ప్రేక్షకులందరూ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసి ఆదరిస్తున్నారు. అలా ఓటీటీలతో భాషాబేధం లేకుండా పోయింది. ప్రస్తుతం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోకి తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ‘రేయికి వేయి కళ్లు’ పేరుతో తీసుకొచ్చిన ఈ చిత్రం ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
భరత్ (అరుల్ నిధి స్టాలిన్) ఓ క్యాబ్ డ్రైవర్. ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేసే సుశీల(మహిమ నంబియార్)తో ప్రేమలో ఉంటాడు. మరోవైపు ప్రేమ పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకొని బ్లాక్మెయిల్ చేసే గణేష్(అజ్మల్ అమీన్) సుశీలను వేధిస్తుంటాడు. తన ప్రేయసిని వేధిస్తున్న గణేష్‌ను వెంటాడే క్రమంలో భరత్.. గణేష్ ముఠాలో ఉండే మాయ హత్య కేసులో చిక్కుకుంటాడు. భరత్‌పై మాయ హత్యానేరం ఎందుకు పడింది? మాయ హత్యా కేసు నుంచి తప్పించుకోవడానికి భరత్ ఏం చేశాడు? బిజినెస్ మ్యాన్ మురుగన్ (ఆనంద్ రాజ్) భార్య వసంత్ (జాన్ విజయ్).. గణేష్‌ని ఎందుకు కలిసింది? సుశీలను వేధించడం వెనుక గణేష్ ప్లాన్ ఏమిటి? అనేది తెలియాలంటే ఆహాలో ‘రేయికి వేయి కళ్లు’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘రేయికి వేయి కళ్లు’ కథ అంతా కూడా ఒక సీరియల్ మర్డర్ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్, డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది ప్రేక్షకులు ఊహించలేరు.. అంచనా వేయలేరు. అదే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.రివర్స్ ఆర్డర్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు.భరత్, సుశీల మధ్య ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది.డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ పాత్ర ఎంట్రీతో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. మాయ హత్య కేసు సినిమాను మరో మలుపు తిప్పుతుంది. మాయను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. డైరెక్టర్ ము. మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ, కథనాలు పకడ్బంధీగా రాసుకున్నారు. మర్డర్ మిస్టరీ ఛేదించే క్రమంలో ఎదురయ్యే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి.సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారికి ‘రేయికి వేయి కళ్లు’ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
క్యాబ్ డ్రైవర్ భరత్ పాత్రలో అరుణ్ నిధి స్టాలిన్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. అజ్మల్ అమీన్ సాఫ్ట్ విలనిజంతో బాగుంది. స్టాప్ నర్సింగ్ సుశీలగా మహిమ నంబియార్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై క్యూట్‌గా బబ్లీగా కనిపించారు. అనంద్ రాజ్, జాన్ విజయ్ పాత్రలు కొంత హాస్యాన్ని పండించడంతో పాటు కథకు మంచి ట్విస్టులుగా మారాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. అరవింద్ సివంగ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.