'ఒబామా చాపర్ హైదరాబాద్‌లో తయారీ'
అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్
విడిభాగాలు హైదరాబాద్‌లో తయారీ
సీఎం కేసీఆర్‌కు తెలియజేసిన అమెరికా రాయబారి రిచర్డ్స్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు వినియోగించనున్న హెలికాప్టర్ విడిభాగాలు హైదరాబాద్‌లో తయారవుతున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో సీఎం కె.చంద్రశేఖరరావును కలిశారు. అనేక రంగాల్లో అమెరికాతో తెలంగాణకు సంబంధాలున్నాయని, అమెరికా అధ్యక్షుడు వినియోగించనున్న హెలికాప్టర్ విడిభాగాలు హైదరాబాద్‌లోని టాటా కంపెనీలో తయారవుతున్నాయని సీఎంకు వివరించారు.
గచ్చిబౌలిలో కొత్తగా నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ కార్యాలయం పురోగతిపై సీఎంతో చర్చించారు. దేశంలో నాలుగు అమెరికా కాన్సులేట్ కార్యాలయాలుంటే అందులో ఒకటి తెలంగాణలో ఉన్నదంటూ తమ దేశం తెలంగాణకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తుచేశారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని రిచర్డ్‌తో సీఎం అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉండే పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చామని వివరించారు.