‘రైట్ టు ప్లే’ అంబాసిడర్‌గా క్విటోవా
హాంకాంగ్: రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ‘రైట్ టు ప్లే’ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది పిల్లలకు ఈ సంస్థ విద్యను అందిస్తోంది. షెన్జెన్ ఓపెన్ సన్నాహకాల్లో భాగంగా క్విటోవా ప్రస్తుతం హాంకాంగ్‌లో ఉంది. ‘గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేయడంపై దృష్టిపెట్టా. నా హృదయానికి దగ్గరగా ఉన్న క్రీడతో కలిసి చిన్నారులకు శిక్షణ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప అనుభూతి’ అని క్విటోవా వ్యాఖ్యానించింది.
స్పీడ్ స్కేటింగ్‌లో నాలుగుసార్లు ఒలింపిక్ స్వర్ణం గెలిచిన జాన్ కోస్ 2000లో ఈ సంస్థను ప్రారంభించారు. 40 దేశాలు, ప్రాం తాల నుంచి 300 మంది వాలంటీర్ అథ్లెట్లు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ‘క్విటోవా అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె మా జట్టుతో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యుత్తమ ఆటతో క్విటోవా టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా నిలబడింది’ అని ఈ సందర్భంగా కోస్ ప్రశంసించారు.