రుణమాఫీ అంటే రీషెడ్యూలా..?
రైతులను మోసం చేస్తే సహించం
ప్రభుత్వమే రైతుల డాక్యుమెంట్లు, నగలు విడిపించాలి
ఉప్పులేటి కల్పన
పామర్రు : రైతులకు రుణాలు మాఫీ చేస్తారో లేదో చెప్పకుండా రీషెడ్యూలింగ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్రామాలాడుతున్నారని పామర్రు ఎమ్మెల్యే, శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తున్నానని రైతులను వంచించారని, నెల గడుస్తున్నా ఈ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై టీడీపీ ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అన్ని హామీలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటుంటే ఇక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని చెప్పారు.
వ్యవసాయ రుణాలు పూర్తి మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల ఆంక్షలు పెడుతూ రైతులను నిలువునా మోసం చేస్తోందని కల్పన ఆరోపించారు. ముఖ్యమంత్రితో సహా ఆర్థిక, వ్యవసాయశాఖ మంత్రులు రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకడం లేదని, అధిక వడ్డీకి అప్పులు చేయాల్సివస్తోందన్నారు.
ఇటువంటి తరుణంలో చంద్రబాబు రీషెడ్యూల్ దిశగా ఆలోచన చేయడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వమే బ్యాంకులకు హామీ ఇచ్చి రైతుల తాకట్టు పెట్టిన భూమి డాక్యుమెంట్లు, నగలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలు తీరేలా పూర్తిగా 10 టీఎంసీల నీరు విడుదల య్యేలా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు శ్రద్ధ చూపాలని కోరారు.
రైతులకు అన్యాయం చేస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని వారితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నత్తారవి, కారపాటి కోటేశ్వరరావు, గారపాటి సతీష్, విమలారావు, శ్రీపతి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.