ఆ హీరో పుట్టు మచ్చలు చూపాలి!
చెన్నై: నటుడు ధనుష్‌కు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు పరిధిలోని మదురై కోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కుమారుడని పేర్కొంటూ మదురై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను, వాళ్లు కోర్టుకు అందజేసిన పత్రాలను జస్టిస్ జి.చోక్కాలింగం పరిశీలించారు. బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది.
హీరో ధనుష్ చెన్నైలోని పాఠశాలలో చదువుకున్న ఆధారాలను, ఆయన పదవ తరగతి పరీక్షలు రాసిన పత్రాలను.. 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తన పేరును నమోదు చేసినట్లు ఆ దంపతులు కోర్టుకు సమర్పించారు. ధనుష్ తరపు న్యాయవాది సమర్పించిన ఆధారాలు పరిశీలించగా ధనుష్ నటించిన తొలి చిత్రం తుళ్లువదో ఇళమై 2002 మార్చి నెలలో సెన్సార్ పూర్తి చేసుకుని మే నెలలో విడుదలయ్యింది. అయితే అయితే ధనుష్ కోర్టుకు అందజేసిన టెన్త్ క్లాస్ టీసీ లో ఐడెంటిటీ మార్క్స్ పేర్కొనలేదు. మరోవైపు కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టుకు ఇచ్చిన టీసీలో పుట్టుమచ్చల వివరాలు ఉన్నాయి. దీంతో వెరిఫికేషన్ కోసం ధనుష్ ను నేరుగా కోర్టులో హాజరుకావాలని మధురై బెంచ్ ఆదేశించింది.
ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ధనుష్ తరపు న్యాయవాది కధిరేశన్ దంపతుల ఆరోపణల్లో నిజం లేదనీ, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా తన పిటిషన్లో పేర్కొన్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కదిరేశన్ దంపతులు కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలో ధనుష్ తరపున కొన్ని ఆధారాలను ఇరు వర్గాలు కోర్టుకు సమర్పించారు. కధిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొనలేక పోవడం గమనార్హం. దీంతో ధనుష్ కోర్టుకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు అందజేసింది.