అదృష్టానికి లైనేశాడు..
ఇలా లైన్లో ఉండే.. ఇతడు అదృష్టానికి లైనేశాడు. తద్వారా తన జీవితానికి కూడా ఓ లైన్ చూసుకున్నాడు. ఇతడి పేరు రాబర్ట్ శామ్యూల్. న్యూయార్క్‌లో ఉంటాడు. ఇతడికో కంపెనీ ఉంది. పేరు.. సోల్డ్. ఇందులో ఏడుగురు ఉద్యోగులున్నారు. త్వరలో మరో 15 మంది చేరబోతున్నారు కూడా. ఇంతకీ వీరందరూ చేసే పనేమిటో తెలుసా? లైన్లో నిల్చోవడం! నిజం.. అయితే, వీరి కోసం కాదు.. వేరేవారి కోసం నిల్చుంటారు. అమెరికాలో మార్కెట్లోకి వచ్చే ఖరీదైన కొత్త వస్తువులను(ఉదాహరణకు ఐఫోన్ కొత్త మోడళ్లు వంటివి) వెంటనే సొంతం చేసుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. అదే వీరికి కలిసొచ్చింది. ఇతడి కస్టమర్ల జాబితాలో కోటీశ్వరుల సంఖ్యే ఎక్కువ. వీరు ఏదైనా వస్తువు కోసం లైన్లో నిల్చోవడానికి తొలి గంటకు రూ.1,500 చార్జి చేస్తారు. తర్వాత ఒక్కో అరగంటకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇంతకీ రాబర్ట్‌కు ఈ వినూత్నమైన ఐడియా ఎలాగొచ్చిందో తెలుసా? ఏడాది కిందట ఇతడి జాబ్ పోయింది. ఏం చేయాలో తెలియదు. ఆ సమయంలో ఐఫోన్-5 రిలీజ్ అవుతుందన్న వార్త. పక్క ఇంటి వ్యక్తి తన కోసం లైన్లో నిల్చుని, ఫోన్ తెస్తే.. రూ.6,000 ఇస్తానన్నాడు. ఏదో బాగానే ఉందనుకుని.. లైన్లో నిల్చున్నాడు. డబ్బు ఇస్తానన్న వ్యక్తి తర్వాత ఫోన్ అక్కర్లేదన్నాడు. దీంతో ఏం చేయాలో తోచలేదు. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి.. లైన్లో రాబర్ట్ ఉన్న ప్లేస్ తనకిస్తే.. డబ్బులిస్తానన్నాడు. అంతే.. అమ్మేశాడు. రెండుసార్లు లైన్ కట్టి.. మొత్తం రూ.20 వేలు సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన ఈ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసింది. లైన్లోకి వెళ్లేటప్పుడు అక్కడే పడుకోవడానికి వీలుగా స్లీపింగ్ బ్యాగ్ వంటివి తనతోపాటు తీసుకెళ్లిపోతాడు. ఇప్పటివరకూ ఐఫోన్-5 కోసం అత్యధికంగా 19 గంటలు లైన్లో వెయిట్ చేశాడట!