పొడవాటి గౌన్లు.. హొయలొలికించిన భామలు
అమెరికాః ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. డిజైనర్లు విభిన్న రీతులను ప్రదర్శించడంలో తమ ప్రతిభను అత్యద్భుతంగా చాటుతున్నారు. ఇటీవల ప్రారంభమైన మెట్ గాలా ఫ్యాషన్ పెరేడ్ అందుకు తార్కాణంగా నిలిచింది. అందమైన పొడవాటి గౌన్లు ధరించి, ఎర్రతివాచీపై ఒయ్యారాలొలికించిన మోడల్స్ సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నారు.
ఫ్యాషన్ కు మరోపేరైన మెట్ గాలా 2016 సంబరాలు అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాలీవుడ్ నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్లు అనేకమంది హాజరయ్యారు. విలక్షణమైన డిజైన్లతో కూడిన విభిన్న దుస్తులు ధరించిన సెలబ్రిటీలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నారు. ప్రతియేటా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ సంస్థకు నిధులు సేకరించేందుకు ఈ మెట్ గాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఫ్యాషన్ ప్రముఖ మోడల్స్ తో పాటు, నటీనటులు కూడ స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారు. ఈసారి కార్యక్రమం ప్రారంభోత్సవంలో హాలీవుడ్ తారలు ప్రత్యేకాకర్షణగా నిలిచారు.
ఫ్యాషన్ పెరేడ్ లో పాల్గొన్న మోడల్స్... తమ దుస్తుల డిజైన్లలో ఒక్కోరు ఒక్కో ప్రత్యేకతను ప్రదర్శించారు. మినీలూయిస్ విట్టన్, మెటాలిక్ రబ్బరు గివెన్సీ గౌన్లు, అద్దకాలతో కూడిన లేజర్ కట్ యాక్రిలిక్స్, షిఫాన్ బుర్బెర్రీ దుస్తులతోపాటు... గొలుసులతో అల్లినట్లుగా కనిపించే చెయిన్ మెయిల్ బాల్మెయిన్ వంటి అనేక రకాల అదరగొట్టే డిజైన్లను ధరించిన మోడల్స్ ర్యాంప్ పై హొయలొలికించారు. ఫ్యాషన్ షోలో తన ఫేరీ టేల్ దుస్తులతో విభిన్నతను చాటిన క్లారీ డేన్స్ ప్రత్యేకతగా నిలువగా, కెన్డాల్ జెన్నర్ ఫ్యాషన్ ప్రపంచాన్ని తన దుస్తులతో విభిన్నంగా చూపారు. జిగి, జాయిన్ లు రోబో కాప్ లుక్ తో మెట్ గాలా బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు.