కేసులకు భయపడే రోహిత్ కులంపై అబద్ధాలు!
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల కులంపై రూపాన్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విస్మయాన్ని వ్యక్తంచేశారు. కేవలం అట్రాసిటీ కేసుల నుంచి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, హేచ్సీయూ వీసీ అప్పారావులను తప్పించేందుకే ఈ నివేదికను ఇచ్చినట్లుగా ఉందని ఆరోపించారు. గుంటూరు కలెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్ రోహిత్ దళితుడేనని తేల్చి చెప్పినా, ఎస్సీ కాదనే రీతిలో ఈ కమిషన్ నివేదిక ఇవ్వడం అసమంజసమని పేర్కొన్నారు.
రోహిత్ దళితుడని, ఆయన ఆత్మహత్యకు దారితీసిన కారణాలున్నప్పటికీ విభిన్న నివేదికల ద్వారా కేసును పక్కదోవ పట్టిస్తున్నారన్నారన్న చాడ...దీనిని ఖండిస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కమిషన్ల నివేదికలతో వాస్తవాలను కప్పిపుచ్చజాలరన్నారు. రోహిత్ ఆత్మహత్యకు బీజేపీ ప్రభుత్వం, వీసీ అప్పారావులే కారణమని ఆరోపించారు. యూనివర్శిటీల్లో విద్యార్థులపై సాగుతున్న వివక్ష, పక్షపాత వైఖరి విధానాలపై విద్యార్థులు ఉద్యమించాలన్నారు.