'హ్యాపీ' న్యూఇయర్.. మూడు రోజుల్లో 100 కోట్లు!
షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం బాక్సాఫీసు రికార్డులను భారీగా కొల్లగొట్టింది. తొలిరోజే రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. తొలిరోజునే దాదాపు 45 కోట్లు వసూలుచేసింది. అతి తక్కువ కాలంలో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డులు బద్దలుకొట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి వారాంతంలోనే.. అంటే మూడు రోజుల్లోనే 108.86 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలుచేసినట్లు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తెలిపింది.
తొలి మూడు రోజుల్లో హిందీ వెర్షన్‌కు దేశవ్యాప్తంగా రూ. 104.10 కోట్లు రాగా, తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు రూ. 2.92 కోట్లు, తమిళ డబ్బింగ్ వెర్షన్‌కు రూ. 1.84 కోట్లు వచ్చాయి. షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థే ఈ సినిమాను నిర్మించగా ఫరాఖాన్ దర్శకత్వం వహించారు. 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ మంచి వసూళ్లు సాధించిందని, ఇప్పుడు హేపీ న్యూ ఇయర్ మరో కొత్త రికార్డు కొట్టిందని రెడ్ చిల్లీస్ సంస్థ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, బొమ్మన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, సోనూ సూద్, వివాన్ షా తదితరులున్నారు.