12.5 లక్షలు పలికిన 0001
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో వీఐపీ నంబర్లపై మోజు పెరిగింది. రవాణశాఖ కేటాయించిన వీఐపీ ఆన్లైన్ ఆప్షన్ మొదటి రౌండు శుక్రవారం ముగిసింది. ఈ వేలంలో 0001 నంబరు కోసం అధికసంఖ్యలో దరఖాస్తున్నారు. ఈ నంబర్‌కు అత్యధిక రేటు పలికింది. రవాణా విభాగం 0001 నంబరు కనీస రిజర్వ్ ధరను మిగతా వీఐపీ నంబర్ల కన్నా అధికంగానే నిర్ణయించింది. రూ.5 లక్షలు ప్రాథమిక విలువగా నిర్ణయించిన ఈ నంబర్ ఆన్లైన్ అప్షన్లలో రూ.12.5 లక్షలు పలికింది. అతితక్కువ రేటు.. ఆన్లైన్ వేలంలో 8888 నంబరు, 0900 న ంబర్లు అతి తక్కువ రేటు పలికాయి. ఈ నంబర్ల ప్రాథమిక విలువ రూ. లక్షగా నిర్ణయించగా ఆన్లైన్ అప్షన్లోనూ ఈ నంబర్లు అదే రేటు పలికాయి.
రెండోస్థానంలో..
0009 నంబరు రూ.8.25 లక్షలు, 0007 నంబరు రూ.5.55 లక్షలతో రెండో స్థానంలో నిలిచాయి. ఈ రెండు నంబర్ల కనీస రిజర్వ్ ధరను రవాణా విభాగం రూ.3 లక్షలుగా నిర్ణయించింది. 9999 నంబరు కనీస ధరను రూ. 2 లక్షలుగా నిర్ణయించగా వేలంలో అది రూ.3.20 లక్షలు పలికింది.
తక్కువగా..
0005 నంబరు కనీస ధరను రూ.3లక్షలుగా నిర్దారించినప్పటికీ అది 9999 కన్నా కొంత తక్కువ రేటు పలికింది. 0005 నంబరు రూ.3.15లక్షలు పలికింది. 0006 నంబరు కనీస రిజర్వ్ ధరను మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించగా అది అంతే పలికింది. 0786 నంబరు కనీస ధర 2 లక్షల రూపాయలుండగా అది రూ.2.15 లక్షలు పలికింది.
ప్రచారం లోపం కారణంగా..
వీఐపీ నంబర్లను వేలం వేయడం మొదటిసారి కావడంతో ప్రజలకు అంతగా తెలియలేదని, మూడోరౌండు నుంచి అధిక స్పందన లభిస్తుందని ఆశిస్తున్నామని రవాణా విభాగం అధికారి చెప్పారు. మొదటి రౌండులో రవాణా విభాగానికి రూ.72.40 లక్షల ఆదాయం లభించింది. మొదటి రౌండులో రవాణా విభాగం 140 వీఐపీ నంబర్లను వాటి కనీస రిజర్వ్ ధర నిర్దారించి ఆన్లైన్ వేలానికి పెట్టింది. వేలంలో పాల్గొనడం కోసం 127 మంది రవాణా విభాగం వెబ్సైట్లో పేర్లు నమోదుచేసుకున్నారు. కానీ చివరి వేలంలో 41 మంది పాల్గొన్నారు. మంగ ళ, గురు. శుక్రవారాలు జరిగిన ఫైనల్ బిడ్డింగ్‌లో 29 మంది పాల్గొని 29 నంబర్లను దక్కించుకొన్నారు. వేలం ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరిగిందని, ఎటువంటి సాంకేతిక సమస్య ఎదురుకాలేదని రవాణా విభాగం అధికారులు పేర్కొన్నారు.