పాల ధర పెంపు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రభుత్వ, పార్టీ రాజకీయ కార్యకలాపాలతో అలసి సొలసిపోయిన అమ్మ పాడి రైతులకు వరం ప్రకటించి కొడనాడుకు విశ్రాంతికి వెళ్లిపోయారు. ఆవు, గేదె పాల సేకరణ ధర మూడు రూపాయలు పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా నడుస్తున్న ఆవిన్తోపాటూ రాష్ట్రంలో అనేక ప్రయివేటు, సహకార పాడిరైతుల సంఘాలు ఉన్నాయి. పశువుల దాణా ధర పెరగడం, సిబ్బంది జీతాలు పెంచక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న సేకరణ ధర గిట్టుబాటు కావడం లేదని కొన్ని నెలలుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. వీరి విజ్ఞప్తులపై అధికారులతో ఇటీవల సమీక్షించిన సీఎం సేకరణ ధర పెంచడం న్యాయ సమ్మతమని నిర్ణయానికి వచ్చారు.
ఆవుపాలకు ఇప్పటి వరకు లీటరుకు రూ.20 చెల్లిస్తుండగా రూ.23 చెల్లించాలని తీర్మానించారు. అలాగే గేదె పాలకు రూ.28 చెల్లిస్తుండగా ఆ ధరను రూ.31కి పెంచేందుకు ఆమె సమ్మతించారు. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి తెస్తున్నట్లు మంగళవారం ఆమె ప్రకటించారు. రాష్ట్రంలోని 22.50 లక్షల సహకార పాల అమ్మకం దారులు పెంచిన ధరలతో లబ్ధిపొందుతారు. పాలసేకరణ ధర పెంపుకారణంగా ప్రభుత్వంపై ఏడాదికి రూ.273 కోట్ల 75 లక్షల అదనపు భారం పడుతుంది. పాల సేకరణ ధర పెంపుపై పాడిరైతుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పాలసీ వల్ల ప్రభుత్వానికి రూ.420 కోట్ల రాబడి వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ మంగళవారం ప్రకటించారు.