బ్యాంక్లో నకిలీ నోట్లను జమ చేసేందుకు వెళ్లి..
భువనేశ్వర్: నకిలీ నోట్లను, నల్లధనాన్ని అరికట్టాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి, నోట్ల మార్పిడికి వీలు కల్పించగా.. ఓ ప్రబుద్ధుడు ఇదే అదునుగా భావించి నకిలీనోట్లను మార్చుకునేందుకు ప్రయత్నించాడు. ఒడిశాలోని ఖుద్రా పట్టణంలో సుమిత్ కుమార్ తుడు అనే యువకుడు నకిలీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు.
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, కొత్తగా 500, 2000 రూపాయల కరెన్సీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పాత నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవాలని, ఎక్కువ మొత్తం అయితే డిపాజిట్ చేయాలని సూచించడంతో ప్రజలు క్యూ కట్టారు. బ్యాంకులు రద్దీగా ఉండటంతో అధికారులు గుర్తించరని భావించిన సుమిత్ నకిలీ నోట్లను ఎస్బీఐ బ్రాంచిలో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. సుమిత్ మొత్తం 2.5 లక్షల రూపాయల నగదు తీసుకెళ్లాడు. వీటిలో 1000 రూపాయల నోట్లు 42, 500 నోట్లు 10 నకిలీవి ఉన్నాయి. మొత్తం 47 వేల రూపాయల విలువైన నకిలీ నోట్లు ఉన్నాయి. బ్యాంక్ అధికారులు ఈ విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సుమిత్ ఓ బ్యాంకు అధికారి కొడుకని పోలీసులు చెప్పారు. ఈ డబ్బులు తన తండ్రివి అని, ఆయన ఖాతాలో డిపాజిట్ చేసేందుకు వచ్చానని సుమిత్ పోలీసులకు చెప్పాడు.