పెళ్లింట్లో భారీ చోరీ
గోల్కొండ: ఆసుపత్రికి వెళ్లొచ్చేలోగా కూతురి పెళ్లి కోసం తెచ్చిన డబ్బు, నగలు దొంగలు ఎత్తుకెళ్లారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్‌పాషా కథనం ప్రకారం... టోలీచౌకి బృందావన్‌కాలనీ నివాసి మహ్మద్ ముస్తఫా మాసబ్‌ట్యాంక్‌లో స్నూకర్ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఈయన కూతురి పెళ్లి డిసెంబర్ 17న జరగనుంది. కొంత కాలం క్రితం ప్రమాదంలో ముస్తఫాకు కాలు విరిగింది. భోజగుట్టలో చికిత్స చేయించుకుంటున్నారు. ఇతని తల్లి కూడా మోకాలి నొప్పితో బాధపడుతోంది.
శనివారం రాత్రి 9 గంటలకు తల్లి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి వైద్య పరీక్ష చేయించుకొనేందుకు ముస్తఫా భోజగుట్టకు వెళ్లారు. రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చేసరికి బెడ్రూం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. పెళ్లి ఖర్చుల కోసం బీరువాలో భద్రపర్చిన రూ. 6 లక్షలతో పాటు 23 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ గౌస్ మొహియుద్దీన్, గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్‌పాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు వంటగది కిటికీ తలుపు పగులగొట్టి ఇంట్లోకి చొరబడినట్టు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.