కోట్ల ఖర్చుతో మరో ఎన్నారై పెళ్ళి...
పెళ్ళంటె పందిళ్ళు, సందళ్ళు.... తప్పెట్లు, తలంబ్రాలు అన్న చందంనుంచీ కోట్ల రూపాయల ఖర్చులు, చిత్ర సీమను మించిపోయే సెట్లుగా మారిపోయాయి. విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ వ్యాపారవేత్తలు వారి పిల్లల పెళ్ళిళ్ళకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి... స్టేటస్ ను చాటుతున్నారు. ఒకరికంటే ఒకరు ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నారు. ఇటీవల కేరళకు చెందిన ఎన్నారై రవి పిళ్ళై జరిపిన అత్యంత ఖరీదైన పెళ్ళి మరిచిపోకముందే... మరో పారిశ్రామికవేత్త యోగేష్ మెహతా తన ఏకైక కుమారుడి పెళ్ళికి సుమారు నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైనం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ఇటాలియన్ వెడ్డింగ్ బొనాంజా ఇప్పుడు దుబాయ్ ప్రజలనే కాక, ప్రపంచాన్నే ఆకట్టుకుంటోంది. దుబాయిలో పేరొందిన వ్యాపారవేత్త.. 2015లో టాప్ 50 ధనవంతుల్లో ఒకరైన యోగేష్ మెహతా... తన కుమారుడు రోహాన్ పెళ్ళిని దుబాయి ప్లోరెన్స్ లోని రిలైన్స్ నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. లండన్ వధువు రోషని తో జరిపిన ఈ వివాహానికి సుమారు 500 మంది అతిథులను ఆహ్వానించారు.
నవంబర్ 25 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన వివాహ మహోత్సవానికి ఇతర దేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. భారత సంప్రదాయ చీరకట్టుతో, చేతులనిండా గోరింటాకు డిజైన్లతో మెరిసిన వధువు రోషని లండన్ లో సొంతంగా ఓ ఫ్యాషన్ కంపెనీని నడుపుతోంది. ఇక వరుడు రోహాన్ తమ కుటుంబం స్థాపించిన ప్రముఖ పెట్రో కెమ్ కంపెనీలో ఇటీవలే చేరాడు. వధూవరులిద్దరూ ఇకపై దుబాయిలోనే స్థిరపడే ఉద్ద్దేశ్యంలో ఉన్నారట.
ఈ కోట్ల రూపాయల పెళ్ళి ఫొటోలను యోగేష్ తన ట్విట్టర్ లో సైతం పోస్ట్ చేశారు. అయితే దక్షిణాసియాలోని సంప్రదాయంలో భాగంగా వరుడు పెళ్ళి సందర్భంలో ఏనుగుపై ఊరేగి రావడానికి మాత్రం... అక్కడి నిబంధనల మేరకు..ఫ్లోరెన్స్ సిటి కౌన్సిల్ అభ్యంతరం తెలిపిందట. ఏది ఏమైనా ఆ సంపన్న వివాహం ఇప్పుడు మీడియాలో ప్రత్యేక వార్తగా మారింది.