నగదు రహిత లావాదేవీల్లో టాప్‌లో ఉండాలి
మచిలీపట్నం(చిలకలపూడి) : నగదు రహిత లావాదేవీల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాబు.ఎ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపుహాలులో సోమవారం మీకోసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై కౌన్సిల్ ఎష్యురెన్స్ కమిటీలను జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండు వేల లోపు జనాభా ఉన్న గ్రామాలు పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు, రెండు నుంచి ఐదు వేల జనాభా ఉండి పూర్తిస్థాయిలో నగదు రహితలావాదేవీలు నిర్వహిస్తే రూ.20 వేలు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. 5 నుంచి 10 వేలలోపు ఉన్న గ్రామాలు పూర్తిస్థాయిలో లావాదేవీలు నిర్వహిస్తే రూ.50 వేలు, 10 వేలు జనాభా దాటిన గ్రామాలు పూర్తిస్థాయిలో లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఒక గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా గురువారం నాటికి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 41 వేల మంది వ్యాపారులకు ఈ పోస్ మిషన్లు అందజేసేందుకు 120 టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. నాలుగు రోజుల్లో రికార్డుస్థాయిలో రేషన్‌షాపుల ద్వారా 2.10 లక్షల నగదు రహిత లావాదేవీలను నిర్వహించినట్లు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో సీపీవో కేవీకే రత్నబాబు, డీఎంహెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరి, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఆర్ యుగంధర్, సాంఘిక సంక్షేమశాఖ జేడీ పీఎస్ఏ ప్రసాద్, డీసీవో ఆనందబాబు పాల్గొన్నారు.
అర్జీలు ఇవే..
మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, స్టాఫ్‌నర్సుల నిర్లక్ష్యంతో కుమార్తె కె.శివపార్వతి కొంత కాలం క్రితం చనిపోగా ఇంత వరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని, తగిన న్యాయం చేయాలని కోరుతూ మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన అద్దంకి లక్ష్మణ అర్జీ ఇచ్చారు.
గ్రంథాలయ పన్ను పంచాయతీలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు.
జిల్లాలోని 33 సీపీడబ్ల్యూఎస్ స్కీంల నిర్వాహకులకు జీతం బకాయిలు చెల్లించాలని కె.భూపతిరెడ్డి అర్జీ ఇచ్చారు.
మచిలీపట్నంలోని అమృతపురం, ముస్తాఖాన్‌పేట, నారాయణపురం తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరుతూ వై.వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు.