డ్రైవింగ్ లెసైన్స్ పొందడం ఇలా..
ప్రయోజనం
సాక్షి, సిటీబ్యూరో: వాహనం నడిపేందుకు ప్రతి ఒక్కరు విధిగా డ్రైవింగ్ లెసైన్స్ కలిగి ఉండాలి. 18 ఏళ్లు దాటిన వారు గేర్లతో కూడిన ద్విచ క్ర వాహనాలు, కార్లు నడిపేందుకు రవాణాశాఖ నుంచి అనుమతి పొందవచ్చు. 18 ఏళ్లలోపు వారిని గేర్లు లేని టూ వీలర్స్ నడిపేందుకు మాత్రమే అనుమతిస్తారు. డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవడమనేది రెండు దశల ప్రక్రియ.
లెర్నింగ్ లెసైన్స్ కోసం...
లెర్నింగ్ లెసైన్స్ తీసుకోవాలంటే ఆర్టీఏ వెబ్సైట్
www.telangana transport.org లోకి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాలి.
- వాహనదారుల చిరునామాకు సమీపంలో ఉండే ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ పొందేందుకు అనుమతి లభిస్తుంది.
-స్లాట్ నమోదు చేసుకున్న 24 గంటల్లోపు సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో లేదా ఈ సేవా కేంద్రంలో ఫీజు చెల్లించాలి.
- టూ వీలర్, ఫోర్ వీలర్లో ఏదైనా ఒకదాని కోసమైతే రూ.60, రెండింటి కోసమైతే రూ.90 చొప్పున ఫీజు చెల్లించాలి.
- 24 గంటలలోపు ఫీజు చెల్లించలేకపోతే అభ్యర్థులు బుక్ చేసుకున్న స్లాట్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.
- స్లాట్ బుక్ చేసుకున్న గడువు, సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు నిర్వహించే పరీక్షకు హాజరు కావాలి.
- ఈ సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకెళ్లాలి.
- లెర్నింగ్ లెసైన్స్ టెస్టులో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు, తదితర అంశాలపై 20 ప్రశ్నలుంటాయి. వీటిలో కనీసం 12 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన సమాధానాలు గుర్తించాలి.
- అలా గుర్తించిన వారికి మాత్రమే లెర్నింగ్ లెసైన్‌స ఇస్తారు. ఇది ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది.
- లెర్నింగ్ లెసైన్‌స పొందిన 30 రోజుల తరువాత నుంచి 6 నెలల్లోపు ఎప్పుడైనా శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవచ్చు.
మంజూరు చేసే కేంద్రాలివే..
ఖైరతాబాద్, తిరుమలగిరి, మెహిదీపట్నం, మలక్‌పేట్, బహదూర్‌పురా, అత్తాపూర్, మేడ్చెల్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నింగ్ లెసైన్‌స పొందవచ్చు.
శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం...
శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం కూడా ఆర్టీఏ వెబ్సైట్ www.telangana transport.org లో స్లాట్ నమోదు చేసుకోవాలి. యథావిధిగా 24 గంటల్లోపు ‘ఈసేవ’లో కానీ, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో కానీ ఫీజు(రూ.475 నుంచి రూ.525) చెల్లించాలి. నగరంలో నాగోల్, కొండాపూర్, మేడ్చెల్, ఉప్పల్‌లోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పరీక్ష నిర్వహిస్తారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం వాహనాలు నడిపిన వారికే డ్రైవింగ్ లెసైన్స్‌లు అందజేస్తారు. మోటారు వాహన తనిఖీ అధికారి పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయి. వాహనదారుడి నైపుణ్యంపై సదరు అధికారి సంతృప్తి చెందితేనే శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ మంజూరవుతుంది. డ్రైవింగ్లెసైన్స్ను పోస్టు ద్వారా అభ్యర్థుల చిరునామాకు పంపిస్తారు.