వాటా కోసమే వారి ప్రచారం
టీఎంయూ ఓడితే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా?
ఎన్నికల ప్రచార సభలోఆర్టీసీ ఈయూ రాష్ట్ర
అధ్యక్షుడు ఎస్.బాబు
హన్మకొండ : టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్రమంగా సంపాదించిన రూ.100 కోట్లలో వాటా కోసమే టీఆర్ఎస్ నేతలు ఆయన తరఫున ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు ఆరోపించారు. ఆర్టీసీ ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఐక్య కూటమి ఎన్నికల బహిరంగ సభ శుక్రవారం ఇక్కడ జరిగింది. ఈ సభలో ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు టీఎంయూకు మద్దతుగా ప్రచారం చేయడంతోనే ఆ యూనియన్ ఓటమి స్పష్టమైందన్నారు. టీఎంయూ ఓడిపోతే టీఆర్ఎస్ నాయకులు వారి పార్టీకి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చిరుద్యోగులైన కండక్టర్లపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టీఎంయూకు సరైన నాయకత్వం లేక రాజకీయ నాయకులు ప్రచారానికి వస్తున్నారని విమర్శించారు.
కండక్టర్ల వ్యవస్థను తొలగించేందుకు యూజమాన్యం కుట్రలు పన్నుతోందని, దీనిపై ఆ యూనియన్ పోరాటం చేస్తుందా అని నిలదీశారు. నిరక్షరాస్యుడు ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, యాజమాన్యం ఏ ఉత్తర్వులు జారీ చేస్తుందో తెలుసుకోలేని వ్యక్తితో కార్మికులకు ఏం న్యాయం జరుగుతుందన్నారు. వేతన బకాయిలు 27న ఇవ్వనున్నట్లు యాజమాన్యం పేర్కొనగా తమ ఐక్య కూటమి అడ్డుకుందంటూ టీఎంయూ రాద్దాంతం చేస్తోందన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు మాట్లాడుతూ కార్మికులు ఇప్పుడు వేసే ఓటుపై రెండేళ్ల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర గుర్తింపు కోసం ఈయూకు, రీజియన్ గుర్తింపు కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈయూ రీజియన్ గౌరవ అధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సకలజనుల సమ్మెను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు సకలజనుల సమ్మె కాల వేతనాన్ని చెల్లించడంలో చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ టీఎంయూ ఏనాడూ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని, పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. ఐక్య కూటమిని గెలిపిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి పోరాడుతామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిని గెలిపించి ఆర్టీసీ కార్మికులు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలన్నారు.
అంతకు ముందు వరంగల్-1 డిపో నుంచి, వరంగల్-2 డిపో మీదుగా విజయటాకీస్, హనుమాన్ దేవాలయం మీదుగా సభాస్థలి వరకు భారీ ర్యాలీ తీశారు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పనాసా ప్రసాద్, ఎస్‌డబ్ల్యూఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.రాంచందర్, రీజియన్ అధ్యక్షుడు ఎస్.యాదగిరి, కార్యదర్శి ఎన్.రాజయ్య, ఈయూ రీజియన్ అధ్యక్షుడు బి.జనార్థన్, కార్యదర్శి ఈదురు వెంకన్న, ఐక్య కూటమి నాయకులు మనోహర్, పునేందర్, రవీందర్‌రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు.