11 ఏళ్ల క్రితం దొరికారు..ఇప్పటికీ నా బిడ్డలే..
ముంబై: ముంబై హైకోర్టు తీర్పుతో ఓ కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. తమ బిడ్డల చదువు అర్థాంతరంగా ఆగిపోకూడదనే తమ పోరాటం గెలిచినందుకు పొంగిపోతోంది. మళ్లీ తమ బిడ్డలు తమ చెంతకు చేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే 11 ఏళ్ల క్రితం దొరికిన ఇద్దరు ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంది ఓ కుటుంబం. అప్పటికే నలుగురు పిల్లలున్నా మా కెందుకులే అనుకోలేదు.. చేరదీసి విద్యాబుద్దులు చెప్పిస్తున్నారు. అకస్మాత్తుగా ఆ కుటుంబం అయోమయంలో పడిపోయింది. ఆ పిల్లలిద్దరూ తన పిల్లలే అంటూ ఓ మహిళ తెరపైకి వచ్చింది.
దీంతో వివాదం మొదలైంది. వివరాల్లోకి వెళితే నలుగురు పిల్లలున్న రుబీనా షేక్, రఫీఖ్ దంపతులకు.. ఆరునెలలు, ఒకటిన్నర సంవత్సరాల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఒక చెత్తకుప్పలో కనిపించారు. వారికి కైసర్,కౌజర్ అనే పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంతలో ఆ ఇద్దరూ తన పిల్లలే అంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు గత మార్చి 25న ఆ పిల్లలిద్దర్నీ దోంగ్రీలోని పునరావాస కేంద్రానికి తరలించారు.
దీంతో మానసిక ఆందోళనకు గురైన తండ్రి రఫీఖ్ వారిని ఇంటికి పంపించాల్సింది కోరుతూ నాగ్పాద పోలీస్ స్టేషన్కు , చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి విజ్క్షప్తి చేశారు. చివరికి ఐదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నందువల్ల , పరీక్షలు రాసేందుకు పిల్లల్ని అనుమతించాలని కోరుతూ ముంబై హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు.
దీనిపై స్పందించిన ముంబై హైకోర్టు ఆ పిల్లల్ని ఆ కుటుంబానికి అప్పగించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవసరమైనపుడు పిల్లల్ని తీసుకుని న్యాయస్థానం ముందు హాజరు కావాలని రఫీఖ్ దంపతులను ఆదేశించింది. అంతేకాకుండా డీఎన్ఏఎ పరీక్షలు నిర్వహించకుండా ...తన పిల్లలే అంటూ వచ్చిన మహిళను అసలు తల్లి ఆమెనని ఎలా నిర్థారిస్తారంటూ పోలీసులపై మండిపడింది. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఏ ప్రాతిపదికన తల్లిదండ్రులను నిర్ణయిస్తారని పోలీసులను ప్రశ్నించింది. కాగా ఈ కేసులో ఒక్కసారి కూడా విచారణ నిమిత్తం సదరు మహిళ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తక్షణమే ఆ పిల్లలిద్దరినీ రఫీఖ్ దంపతులకు అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు కోర్టు నిర్ణయంతో తల్లి రుబీనా పరవశించిపోతోంది. తనకు చదువు రాదనీ, చట్టం తెలియదనీ, నాకు నా పిల్లలే ముఖ్యమంటోంది. బిడ్డలు తమ చెంతకు చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. నిజంగా పిల్లల అసలు తల్లి వస్తే... ఆమెకు బిడ్డల్ని సంతోషంగా అప్పగిస్తానంటోంది. అప్పటివరకు పిల్లలు తన దగ్గరే ఉండాలంటోంది. ఈ రెండు నెలలుగా చాలా బాధపడ్డామనీ, పిల్లల రాకతో మళ్లీ తమ ఇంట్లో పండగ వచ్చిందని రుబీనా మురిసిపోతుంది.
మరోవైపు సంతోషం నిండిన ముఖాలతో పిల్లలిద్దరూ తల్లి అక్కున చేరారు. అమ్మానాన్నలనుంచి మమ్మల్ని వేరుచేయకండి.. ఎప్పటికి మాకు వారే కావాలి. మా ఇంటికంటే కంటే గొప్పది ఏదీ లేదంటున్నారు వారు.