రంజాన్‌కు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని మసీదులు, దర్గాల వద్ద ముమ్మర ఏర్పాట్లు చేశారు. బుధవారం నెలవంక కన్పించక పోవడంతో గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు రుహయిత్-ఇ-హిలాల్ కమిటీ ప్రకటించింది. నెలవంక కన్పించిన వెంటనే మసీదుల్లో తరాబీ నమాజ్‌తో రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. శుక్రవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభం అవుతాయి.
ఇప్పటికే ప్రభుత్వం తరపున మక్కామసీదు, రాయల్ మసీదుల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. నమాజ్ వేళల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఒక గంట ముందే విధులను విరమించుకోవచ్చని తెలిపింది. జూన్ 18 నుంచి జూలై 17 వరకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.