విధి మరోలా తలచింది..
చంచల్గూడ (హైదరాబాద్) : పోలీసు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని కలలు కన్న ఓ యువకుడి విషయంలో విధి మరోలా తలచింది. ఉద్యోగ యత్నాల్లో భాగంగా రన్నింగ్ ప్రాక్టీసు చేస్తున్న ఆ యువకుడు గుండెనొప్పితో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కుర్మగూడ మాదన్నపేట బస్తీలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదన్నపేట హరిజనబస్తీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ దర్శనం గణేష్ పెద్ద కొడుకు సునీల్ కుమార్ (28) డిగ్రీ పూర్తి చేశాడు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న సునీల్ రాత పరీక్షలో క్వాలిఫై అయ్యాడు. ఈ నెల 8వ తేదీన శరీర దారుఢ్య పరీక్షలు ఉండటంతో రన్నింగ్ ప్రాక్టీసు చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ప్రాక్టీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సునీల్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే స్పృహ కోల్పోయాడు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా సునీల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.