టికెట్ తనిఖీ సిబ్బందీ రన్నింగ్ స్టాఫే
న్యూఢిల్లీ: బ్రిటిష్ జమానాలో రద్దయిన సౌకర్యాలను రైల్వే టికెట్ తనిఖీ సిబ్బంది 87 ఏళ్ల తర్వాత తిరిగి పొందేందుకు మార్గం సుగమమైంది. రైలు ప్రయాణం సురక్షితంగా సాగడంలో కీలకంగా వ్యవహరించే లోకో డ్రైవర్లు, అసిస్టెంట్ లోకో డ్రైవర్లు, గార్డులు, బ్రేక్స్మెన్ తదితరులను రన్నింగ్స్టాఫ్గా వ్యవహరిస్తారు. 1931 వరకు టికెట్ తనిఖీ సిబ్బంది కూడా రన్నింగ్ స్టాఫ్‌లో భాగంగానే ఉండేవారు. అయితే, తమకు వ్యతిరేకంగా పోరాడే భారతీయ నేతలు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో వీరిని రన్నింగ్‌స్టాఫ్ జాబితా నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి టికెట్ తనిఖీ సిబ్బంది మిగతా ‘రన్నింగ్‌స్టాఫ్’తో పోలిస్తే వేతనాలు, అలవెన్సులు, పింఛన్లు తదితర విషయాల్లో వివక్షకు గురవుతున్నారు. దీంతో వీరు తమను తిరిగి రన్నింగ్‌స్టాఫ్ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు స్పందించిన రైల్వే శాఖ ఈ విషయమై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని తాజాగా నియమించింది.