బేరం కుదిరింది
జమ్మలమడుగు: ఎందుకు మాపై దాడులు చేస్తారు.. మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళదాం.. దుకాణానికి రూ. 10 వేలు చొప్పున ప్రతి నెలా అందజేస్తాం.. ఇకపై మా దుకాణాల జోలికి రాకండి.. ఒకవేళ వచ్చినా చూసీ చూడనట్లు వెళ్లండి... జమ్మలమడుగుకు చెందిన పురుగుమందుల దుకాణ యజమానులు అధికారులకు చేసిన విన్నపాలు ఇవి. జమ్మలమడుగులోనిదాడులు చేసి నకిలీ క్రిమిసంహారకమందులు, ఎరువులను సీజ్ చేశారు. దీంతో అధికారులను మంచి చేసుకోవాలని పురుగుమందుల దుకాణ యజమానులు నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడువుగా గండికోటలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఏడీ ఇన్నయ్యరెడ్డి, ఏఈ, ఏఈవోలు విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురుగుమందుల దుకాణ యజమానులు మందు బాటిళ్లతో పాటు తమ డిమాండ్లను అధికారుల ఎదుట పెట్టారు. తనిఖీలు చేసినప్పుడు సరకుల రిజిస్టర్లు సక్రమంగా లేకపోయినా చూసీ చూడనట్లు వెళ్లండి .. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మకాలు చేస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పట్టించుకోకండి.. ఇందుకు ప్రతి దుకాణానికి నెలకు రూ. 10 వేలు చొప్పున ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు అధికారులు కూడా తలూపినట్లు సమాచారం.