పూలన్ దేవీ హంతకుడా, మజాకా ?!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్ పూర్లో మే 9వ తేదీన జరిగిన దళితుడైన సచిన్ వాలియా అనుమానాస్పద మృతిపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడిగా ‘బందిపోటు రాణి’ పూలన్ దేవీ హంతకుడైన షేర్ సింగ్ రాణా పేరును పేర్కొనడమే అందుకు కారణం. మరోపక్క చనిపోయిన దళితుడు కూడా సామాన్యుడు కాదు. ‘భీమ్ ఆర్మీ’ సహ్రాన్‌పూర్ జిల్లా చీఫ్ కమల్ వాలియా సోదరుడు సచిన్ వాలియా(25). ఇరువర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. రాజ్‌పుత్ అలియస్ ఠాకూర్లు హీరోగా భావించే షేర్ సింగ్ రాణాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు యూపీ పోలీసులు సాహసించడం లేదు.
2001లో ఢిల్లీలో జరిగిన ఫూలన్‌దేవి హత్య కేసులో జైలుకెళ్లిన షేర్ సింగ్ రాణా 2004లో జైలు నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో యావజ్జీవ జైలు శిక్ష పడిన ఆయన ప్రస్తుతం బెయిలపై ఉన్నారు. 16వ శతాబ్దానికి చెందిన మహారాణా ప్రతాప్ వార్షికోత్సవం సందర్భంగా మే 9వ తేదీన ఠాకూర్లు జరిపిన కాల్పుల్లో సచిన్ వాలియా మరణించారన్నది స్థానిక దళితుల వాదన. షేర్ సింగ్ రాణా ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లోనే సచిన్ వాలియా మరణించాడన్నది ఆయన తల్లి వాదన. సచిన్ వాలియా మిత్రులు పొరపాటున జరిపిన కాల్పుల్లో మరణించాడన్నది ఠాకూర్ల వాదన. షేర్ సింగ్ రాణా స్థానికంగా ప్రముఖుడు. ఆయన పేరు, ముఖచిత్రంతో ఉన్న టీషర్టులు ఇంటర్నెట్లో తెగ అమ్ముడుపోతున్నాయి. ఆయన్ని హీరోగా కీర్తిస్తున్న అనేక పాటలు ‘యూట్యూబ్’లో అందుబాటులో ఉన్నాయి. ‘షేర్ సింగ్ రాణా క్షత్రియ యువకులకు నిజమైన హీరో’ అని ఉత్తరప్రదేశ్ క్షత్రియ మహాసభ అధ్యక్షుడు ఖాన్ సింగ్ రాణా వ్యాఖ్యానించారు.
పూలన్ దేవీ హత్యతో...
పూలన్ దేవీ హత్య వరకు సేర్ సింగ్ రాణా గురించి పెద్దగా ఎవరికి తెలియదు. 2001, జూలై నెలలో పార్లమెంట్ నుంచి అధికార నివాసానికి బయల్దేరిన పూలన్ దేవీని నివాసం వద్ద ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. వారిలో ఒక వ్యక్తే షేర్ సంగ్ రాణాగా, ఆయనే హత్యకు ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. పూలన్ దేవీ బందిపోటు రాణిగా 21 మంది ఠాకూర్లను హత్య చేసినందుకు ప్రతీకారంగానే తానీ హత్య చేశానని రాణా నేరం అంగీకరించారు. 2004లో జైలు నుంచి తప్పించుకున్న రాణాను ఢిల్లీ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసులు 2006లో కోల్‌కతాలో అరెస్ట్ చేశారు. 2014లో రాణాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2016లో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయనకు బెయిల్ రావడంలో కూడా రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
తీహార్ జైల్లో ఉన్న రాణాకు 2004కు ముందు జైల్లో కొంతమంది టెర్రరిస్టులు తారసపడ్డారట. 1192లో మొహమ్మద్ ఘోరీ చేతుల్లో ఓడి పోయిన 12వ శతాబ్దానికి చెందిన హిందూ మహారాజు పృధ్వీరాజ్ చౌహాన్ సమాధిలోని అవశేషాలను తీసుకొస్తానని వారితో రాణా సవాల్ చేశాడట. ఆ మేరకు 2004లో ఓ పోలీసు అధికారి (నకిలీ) వెంట కోర్టుకు వెళుతున్నట్లుగా నటించి తీహార్ జైలు నుంచి తప్పించుకున్నారు. మొరదాబాద్, రాంచీ మీదుగా కోల్‌కతా చేరుకున్నారు. అక్కడ సంజయ్ గుప్తా పేరిట నకిలీ పాస్‌పోర్టు సంపాదించారు. బంగ్లాదేశ్‌కు మూడు నెలల వీసా సంపాదించి ఆ దేశానికి వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లి, అక్కడి నుంచి అఫ్ఘానిస్థాన్ వెళ్లారు. మొహమ్మద్ ఘోరీ తన చేతుల్లో ఓడిపోయిన పృధ్వీరాజ్ చౌహాన్‌ను భారత్‌లో చంపేయకుండా అఫ్ఘానిస్థాన్ తీసుకెళ్లి అక్కడ చంపేశారన్నది రాణా నమ్మకం. అందుకనే ఆయన అక్కడికి వెళ్లారు. అఫ్ఘానిస్థాన్లోని దెహ్యాక్ వెళ్లి అక్కడ పృధ్వీరాజ్ చౌహాన్దిగా భావిస్తున్న ఓ మట్టి సమాధిని తవ్వి కొన్ని అవశేషాలను రాణా భారత్‌కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాణా పలు సందర్భాల్లో భారతీయ మీడియాకు స్వయంగా తెలిపారు. ఆ అవశేషాలను వివిధ క్షత్రియ సంస్థలకు ఇచ్చారు. అందులో కొన్ని అవశేషాలను యూపీలోని మెయిన్‌పురిలోని స్మారక భవనంలో భద్రపర్చారు.
అజయ్ దేవగన్‌తో సినిమా!
తీహార్ జైలు నుంచి అఫ్ఘానిస్థాన్ వరకు తాను సాగించిన సాహస యాత్ర గురించి రాణా ‘జైల్ డైరీ: తీహార్ సే కాబూల్–కాందహార్’ అనే పుస్తకం రాశారు. ఇది 2012లో విడుదలయింది. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో సినిమా తీస్తున్నారని, రాణా పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ లేదా అజయ్ దేవగన్ నటించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయమై అజయ్ దేవగన్ తనతో మాట్లాడినట్లు రాణా పలుసార్లు స్వయంగా చెప్పుకున్నారు.
(ఠాకూర్ల చేతుల్లో అంతులేని అత్యాచారాలకు గురైన పూలన్‌దేవీ బందిపోటు రాణిగా మారడాన్ని ఇతివృత్తంగా తీసుకొని బాలివుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ‘బండిట్ క్వీన్’ పేరిట సినిమా తీయడం, 1994లో విడుదలైన ఆ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం తెల్సిందే)