మోసం అతని నైజం
రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి): ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, రుణ మాఫీ అంటూ రైతులను మోసం చేసి పరారయ్యే ఘరానా మోసగాడిని జిల్లాలోని రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాల మేరకు మురమళ్ల గ్రామానికి చెందిన సలాది రాం గోపాల్ అలియాస్ సుంకర శివరాం, అలియాస్ వేణు గోపాల్ వివిధ మోసాలకు పాల్పడ్డాడు.
2006 సంవత్సరం న్యూవే ఫౌండేషన్, రైతు మిత్ర సంఘం, ఆంధ్రా కిసాన్ సంఘం, చంద్రన్న బీమా, స్వచ్ఛ భారత్ పథకాల్లో ఉద్యోగాలు, కాంట్రాక్టులు, రైతులకు రుణాలు, ఎరువులు ఉచితంగా ఇప్పిస్తానని నమ్మించాడు. నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకొని పరారయ్యేవాడు. ఇతడు రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా కేసుల్లో నిందితుడు. 2014లో రాజమహేంద్రవరం రైతు మిత్ర ఫౌండేషన్ సంస్థ స్థాపించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఉద్యోగాలు, రైతులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి రూ.1.45 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు.
2016లో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రన్న బీమా అనే కార్యాలయం పెట్టి అందులో ఫీల్డ్ ఆఫీసర్నని పరిచయం చేసుకుని దీపిక ట్రావెల్స్‌లో కారును అద్దెకు తీసుకొని రెండు నెలలు అద్దె చెల్లించి మూడో నెలలో కారుతో సహా ఉడాయించాడు. రాంగోపాల్ ఇప్పటికే 12 కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు. మరో 8 కేసుల్లో అరెస్ట్ అవ్వాల్సి ఉంది. రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల్లో ప్రజలను మోసం చేసి రూ.52.14 లక్షలతో పరారయ్యాడు. గత కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని శుక్రవారం రాజమహేంద్రవరం శ్యామలానగర్ సెంటర్లో పోలీసులు పట్టుకున్నారు.