అప్పుడు సీమాంధ్ర నేతలెవ్వరు మాట్లాడలేదే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక సమైక్య పార్టీ పెట్టడంలో అర్థం లేదని జై ఆంధ్ర ఉద్యమ నేత, మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత 20 రోజుల వరకు సీమాంధ్ర నేతలెవ్వరూ మాట్లాడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అటు విద్యార్థులు, ఇటు ఎన్జీవోలు సమైక్య ఉద్యమం చేశారని, ఆ తర్వాతే నేతలు రంగంలోకి దిగి ఢిల్లీలో ఉద్యమం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమం ఏర్పడకముందే జై ఆంధ్ర ఉద్యమం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర సమైక్యానికి ప్రతీకగా ఓ పార్టీ పెట్టేందుకు కిరణ్ సంకల్పించారు. ఆ క్రమంలో లోక్సభలో యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పలువురు ఎంపీలు ఆదివారం మాదాపూర్లో కిరణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. అలాగే సోమవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సిఎం కిరణ్ సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజులలో సీఎం కిరణ్ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారని సమాచారం.
అదికాక గతేడాది జులై 30న సీడబ్య్లుసీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో సీమాంధ్ర నేతలు ఎవ్వరు సీడబ్య్లసి నిర్ణయంపై ప్రతిఘటించలేదు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దాంతో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులలో కదలిక వచ్చిన సంగతి తెలిసిందే.