నటి సంజీదా షేక్‌పై గృహహింస కేసు
సాక్షి, న్యూఢిల్లీ: హిందీ సీరియల్ పాపులర్ నటి సంజీదా షేక్‌పై గృహహింస కేసు నమోదయ్యింది. సంజీదా, ఆమె కుటుంబ సభ్యులు తనని హింసించారంటూ ఆమె ఆడపడుచు జకేరాబాను జకీర్ హుస్సేన్ బగ్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ యేడాది మే 27న తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో అకారణంగా సంజీదా ఫ్యామిలీ మొత్తం తనపై దాడి చేశారని జకేరాబాను తెలిపింది. ఘటన తర్వాత తన పుట్టింటికి వెళ్లిపోయిందని, తల్లిదండ్రులు తనని ఆస్పత్రిలో చేర్పించారని, చివరకు కోలుకోవటంతో షర్కేజ్ ప్రాంత పోలీసులను ఆశ్రయించానని జకేరా చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఆరోపణలపై సంజీద నోరు మెదపకపోగా, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం స్పందించారు.
‘సంజీదా ఆ ఆరోజు ఇంట్లో లేనే లేదు. జకేరా చేస్తున్నవన్నీ ఆరోపణలే. తనకీ అత్తగారి ఇంట్లో ఉండటం ఇష్టం లేకనే ఇలా రచ్చ చేస్తోంది’ అని సంజీద తల్లి చెబుతున్నారు. మరోవైపు అహ్మదాబాద్ హైకోర్టు నటికి ఊరటనిచ్చింది. విచారణ పేరిట నటిని ఇబ్బంది పెట్టవద్దంటూ కోర్టు పోలీస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.
క్యా హోగా నిమ్మో కా సీరియల్ ద్వారా ఆరంగ్రేటం చేసిన సంజీద షేక్, నటుడు అమీర్ అలీని వివాహం చేసుకున్నారు. నాచ్ బలియే లాంటి పాపులర్ రియాలిటీ షోలతోపాటు పలు సీరియళ్లలోనూ ఆమె నటించారు. 32 ఏళ్ల సజీద ప్రస్తుతం లవ్ కా హై ఇంతెజార్ సీరియల్లో కామిని మాథుర్ పాత్ర లో నటిస్తోంది.