ఉద్యమకారులపై ఎస్ఐ జులుం
చౌడేపల్లె, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమకారులపై పుంగనూరు ఎస్ఐ శంకరమల్లయ్య జులుం ప్రదర్శించి చేయి చేసుకున్న ఘటన ఆదివారం చౌడేపల్లె బస్టాండులో చోటు చేసుకుంది. సదుం మండలం నుంచి మాజీ ఎంపీ మేనకాగాంధీ రోడ్డుమార్గంలో చౌడేపల్లె మీదుగా పుంగనూరుకు వెళ్తున్నారని ఉద్యమకారులకు సమాచారం అందింది. దీంతో వారు ఆమె వాహనాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె వాహనానికి ముందు వస్తున్న ఎస్ఐ జీపు దిగి ఉద్యమకారులపై విరుచుకుపడ్డారు.
మేనకాగాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన తీరు మారలేదు. ఉద్యమకారులను పక్కకు నెట్టి చేయిచేసుకున్నారు. దీంతో సమైక్యవాదులు ఎస్ఐకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆపై చౌడేపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలమనేరు డీ ఎస్పీ, ఎస్పీలకూ ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు వడ్డెర సంఘం నాయకులు పేర్కొన్నారు.