విద్యార్థిని కొట్టిన సహాయకుడు.. తీవ్రగాయాలు
నల్లగొండ జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ పిల్లాడిని రాములు అనే సహాయకుడు దారుణంగా కొట్టారు. దాంతో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట సరస్వతీ విద్యామందిర్‌లో జరిగింది. అతడి ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయినట్లు కూడా తెలుస్తోంది. అయితే వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. బాలుడిని కొట్టిన సహాయకుడు రాములుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నాలుగురోజుల క్రితమే తిరుమలగిరిలో ఒకటోతరగతి విద్యార్థిని టీచర్ కొట్టడంతో మృతి చెందిన ఘటన మరువకముందే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
ఈ ఘటనపై నల్గొండ జిల్లా డీఈవో విశ్వనాథం స్పందించారు. సరస్వతి విద్యామందిర్‌లో ఆరో తరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారని, రాములు అనే సహాయకుడు వెళ్లి ఆ గొడవ ఆపి, రెండు దెబ్బలు వేసినట్లు సమాచారం ఉందని అన్నారు. అయితే మెడపైన కొట్టడంతో నరాల మీద ఒత్తిడి కలిగి పిల్లాడు వాంతులు చేసుకున్నాడని, అతడిని స్థానిక ఆస్పత్రికి, అక్కడినుంచి ఏరియా ఆస్పత్రికి పంపారని చెప్పారు. స్కూలుకు నోటీసులు ఇచ్చామని, అవసరమైతే పాఠశాల గుర్తింపును కూడా రద్దుచేస్తామని ఆయన అన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పిల్లలను కొట్టకూడదని, దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదుతీసుకుని పోలీసు కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.వాళ్లు ముందుకు రాకపోయినా క్రిమినల్ కేసు పెడతామని, విచారణలో తేలిన అంశాలను బట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు.