బట్టల దుకాణంలో చోరీ: మహిళ పట్టివేత
బయ్యారం(ఖమ్మం): ఖమ్మం జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఓ దుకాణంలో గురువారం సాయంత్రం చీరల దొంగతనం జరిగింది. ఇందుకు పాల్పడ్డ ముఠాలో ఒక మహిళ పట్టుబడింది. వివరాలివీ.. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సరితా శారీ సెంటర్ ఉంది. ఇందులోకి గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఐదుగురు మహిళలు ప్రవేశించారు. వారిలో ఇద్దరు చీరలను బేరం చేస్తుండగా మిగతా ముగ్గురూ ఇరవై చీరలను తమ బ్యాగుల్లో దాచిపెట్టుకున్నారు.
ఒక చీరను కొనుక్కుని వారు వెళ్లిపోయిన తర్వాత.. చీరలకు సంబంధించిన ఖాళీ పెట్టెలు మాత్రమే మిగిలి ఉండటం దుకాణం సిబ్బంది గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే వారు గాలించగా ఒక మహిళ పట్టుబడింది. ఆమె వద్ద నుంచి 5 చీరలను స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు. మిగతా వారు పరారయ్యారు. కాగా, వారంతా వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం ముంజమడుగు తండా వాసులని తేలింది.