కూరగాయలమ్మి కాదు.. సర్పంచ్
⇒ తుళ్లూరు మండలం మల్కాపురం సర్పంచ్ పార్వతి దయనీయ స్థితి
⇒ నా విధులు, బాధ్యతలు ఏంటో తెలియవు
⇒ పదవులు కూడు పెట్టవంటూ ఆవేదన
తుళ్లూరు (తాడికొండ): ఏపీ రాజధానిలో ఆమె ఓ గ్రామ సర్పంచ్. అయితే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామ సర్పంచ్ భూక్యా పార్వతి తుళ్లూరులో చాలా కాలంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. దీనిపై ఆమెను ‘సాక్షి’ పలుకరించగా.. సర్పంచ్ పదవి ఉన్నా అలంకార ప్రాయంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం గడవటం కష్టమవ్వడంతో కూరగాయలు అమ్ముకుంటున్నట్లు తెలిపారు.
సర్పంచ్‌లకు నెలకు రూ.3,000 వేతనం ఇస్తున్నారని, ఈ నగదుతో ఎలా కుటుంబాన్ని నెట్టుకురావాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎంత ఖర్చయిందని ఆమెను అడగ్గా.. తాను పెద్దగా ఖర్చు చేయలేదని అంతా అధికార పార్టీ నాయకులే చూసుకున్నారన్నారు. మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఏమైనా చేశారా అంటే.. రోజూ దగ్గరుండి మురుగు కాలువలు, చెత్త కుప్పలు తీయిస్తానని చెప్పారు. ఇవి తప్ప నాకు ఇంకా ఏ పనులు ఉంటాయి చేయడానికి అని ఆమె బదులిచ్చారు.
పేరు ఒకరిది.. పాలన మరొకరిది
ఎస్టీ రిజర్వేషన్ కోటాతో పాటు మహిళా రిజర్వేషన్ కోటాలో పార్వతి మల్కాపురం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆ పదవికి సంబంధించిన విధులు, బాధ్యతలు, గ్రామ పంచాయతీ నిధుల గురించి ఆమెకు తెలియకపోవడం స్థానికంగా చర్చనీ యాంశంగా మారింది. పార్వతికి తన బాధ్యతలు తెలియనీ యకుండా కొందరు షాడో నేతలు పాలన చేస్తున్నారు. సర్పంచ్‌గా పేరు ఒకరిది.. పాలన మరొకరిది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. రిజర్వేషన్ కేటగిరీలో చదువు, సామర్థ్యం ఉన్నవారికి రాజకీయాల్లో అవకాశం కల్పిస్తే షాడో నేతల ఆటలు సాగవని అమాయకులను గెలిపించుకుంటున్నారని చెప్పడానికి పార్వతి ప్రత్యక్ష సాక్ష్యం. రానున్న ఎన్నికల్లో అయినా ప్రభుత్వం తీరు మారాలని ప్రజలు కోరుకుంటున్నారు.