గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం
పెట్రోలియం మంత్రిని కోరిన బీపీ చీఫ్
మాస్కో: కృష్ణా గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి పెంపునకు గ్యాస్ ధర సవరణ, చట్ట సంబంధ అనుమతులు అవరోధాలుగా మారిన నేపథ్యంలో బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డూబ్లే భారత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. మాస్కోలో మంగళవారం ప్రపంచ పెట్రోలియం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన్‌ను ఆయన కలుసుకున్నారు. గ్యాస్ ధరల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా డూబ్లే కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కేజీ డీ6తో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను బీపీ 2011లో 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కేజీ డీ6లో నానాటికీ క్షీణిస్తున్న ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ అనుమతులు జాప్యం కావడం బీపీకి నిరాశ కలిగించింది. గ్యాస్ ధరను గత ఏప్రిల్ 1 నుంచి పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి డూబ్లే తెచ్చారు. కేజీ డీ6లో ప్రస్తుతం రోజుకు 13 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మూడేళ్ల కిందటి ఉత్పత్తితో పోలిస్తే ఇది కేవలం ఐదో వంతే. ధరల పెంపుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే తమ పెట్టుబడుల నిర్ణయాలు కొలిక్కి వస్తాయని బీపీ చెబుతోంది.