సొట్ట బుగ్గల కారు
నాన్న కొన్న కార్ బుజ్జిది! అందంగా ఉంటుంది! రోజూ కడుగుతాడు! ఒక పాలిష్ డబ్బా కూడా కొన్నాడు! రోజూ మెత్తటి బట్టతో కారును తోముతాడు! కార్ బాడీ మీద తన ముఖం కనబడే వరకు తోముతాడు! ఆ తరువాత దాని మీద ఒక కవర్ వేసి ఇంట్లోకి వస్తాడు! ఆ కారు కొని ఐదేళ్లయ్యింది! మా అమ్మను చేసుకుని పాతికేళ్లయ్యింది! నాకు కార్ నడపడం వచ్చు. కానీ ఇప్పటిదాకా నాన్న కార్‌ను నడపలేదు!
నేను నడుపుతాను... అంటే నాన్న టెన్షన్ పడతాడని తెలుసు! ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని ఎప్పుడూ అడగలేదు! అప్పుడెప్పుడో ఓ సారి... ‘నేను కారు నేర్చుకోవాలి’ అని చెప్పా! నెక్ట్స్ డే ఇంటి ముందు కార్ డ్రైవింగ్ స్కూల్ బండి ఒకటి నా కోసం రెడీగా ఉంచాడు! అమ్మ అడిగింది ‘మన కార్లో నేర్చుకోవచ్చు కదా?’ అని. తింటున్న బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్లో చేతులు కడిగేశాడు. అమ్మ ఊరుకుంటుందా!? వెనకాలే వెళ్లింది.
అమ్మ వస్తుందని తెలిసి న్యూస్ పేపర్లో ముఖం దాచుకున్నాడు నాన్న. ‘ప్రపంచంలో అన్ని వార్తల్నీ చదివేయాలని డిసైడ్ చేసుకున్నట్టున్నారు!’ అని అమ్మ రెట్టించింది.నాన్న దగ్గర నుంచి ఉలుకూ పలుకూ లేదు. తలను ఇంకా లోతుగా పేపర్లోకి దూర్చాడు. ‘అమ్మాయికి కార్ నేర్పిస్తే మీ కారేమయినా అరిగిపోతుందా?’ అమ్మ విషయాన్ని వదలడం లేదు. నాన్న లేచి బాత్రూమ్లో దూరాడు.
అమ్మ బాత్రూమ్ డోర్ బయట నిలబడి అడిగింది. ‘కడుక్కుంటే పోదు బాధ్యత’ లోపల్నుంచి సౌండ్ లేదు. ‘మరి ఎందుకు కన్నట్టో...?’
నో రెస్పాన్స్ ఫ్రమ్ డాడీ.
‘పడితే రెండు గీతలు పడతాయి...!’ లోపల్నుంచి ట్యాప్ మూసిన సౌండ్... ‘మా అమ్మోళ్లిచ్చిన నగలు అమ్మిపెడతా... దానికి కారు నేర్పించండి’ బాత్రూమ్ డోర్ ఓపెన్ అయింది, చెమటలు కక్కుతూ నాన్న ఇంటి బయట గార్డెన్‌లోకి వెళ్లాడు. అమ్మ ఫాలో అయింది. నాన్న వేప చెట్టు ఆకులు మెల్లగా ఒకటొకటి తెంపడం మొదలు పెట్టాడు. ‘దానికి ఉండదా... నాన్న నేర్పించాడని చెప్పుకోవాలని..?’ అడిగింది అమ్మ. టెన్షన్లో రెండు రెండు ఆకులు తెంపడం మొదలు పెట్టాడు నాన్న. ‘కార్ మీద ఉన్న ప్రేమలో 10 పర్సెంట్ అమ్మాయి మీద ఉంటే బాగుండేది’. కింద ఉన్న కొమ్మ బోసి పోయింది, టెన్షన్లో నాన్న స్టూల్ తెచ్చుకుని మరీ పైన ఉన్న ఆకులు తెంచడం మొదలు పెట్టాడు.
‘ఎవడో పరాయోడి పక్కన కూర్చుని కారు నేర్చుకోవాలి’.
మళ్లీ రెండు రెండు ఆకులు రెట్టింపు స్పీడ్‌లో నాశనం అయిపోతున్నాయి. ‘ఇది తెలిస్తే దానికి పెళ్లెలా అవుతుంది? పరాయివాడితో పెళ్లి కాకుండా కారు నేర్చుకుంటే సమాజం ఏమంటుంది? ఆలోచించారా!’’ అమ్మ కొట్టిన పాతచింతకాయ పచ్చడి డైలాగ్‌కి నాన్న ఢమాల్.కొమ్మ విరిగింది. నాన్న కింద పడ్డాడు. అమ్మ పట్టుకుంది.ఆర్గ్యుమెంట్ ఆగిపోయింది! ఇద్దరూ కలిసి కింద పడ్డ ఆకులన్నీ ఏరడం మొదలు పెట్టారు. చిన్న చిన్న గొడవలతో ప్లేట్లు పడేసినా అంతే... ఇద్దరూ కలిసి సర్దుకుంటారు వాటిని. వీళ్ల సంసారంలో గొప్ప సర్దుబాటు అదే. తప్పు ఎవరిదైనా దిద్దు ఇద్దరిదీ. నాన్నకు నేనంటే ప్రేమ లేక కాదు. కారంటే ప్రీతి!.
చాలా కష్టపడి పైకి వచ్చాడు. మంచి నీళ్లు, ఒక అరటిపండు తిని మా కోసం డబ్బులు దాచి పెట్టాడు. తన తమ్ముళ్లను కూడా చదివించాడు. ఒక చెల్లెలికి పెళ్లి చేశాడు. ఈ చిన్న ఇల్లు కూడా కూడబెట్టి కూడబెట్టి కట్టాడు! కాదు, కూడబెట్టింది నాన్న! నిలబడి కట్టించింది అమ్మ!గృహప్రవేశానికి నాన్న బంధువులు ఎవరూ రాలా! నాన్న సంపాదనతో చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కదా, టైమ్ దొరకలా! నాన్న ఏడ్చాడు! చిన్న పిల్లాడిలా ఏడ్చాడు! ‘నేను, సాత్విక ఉన్నాం కదా..! ఎందుకు బాధ పడతారు, మీ తమ్ముళ్లకు, చెల్లెలికి మీరంటే ప్రేమ లేక కాదు. వాళ్లకూ పనులుంటాయిగా అని సర్దిచెప్పింది.’ చొక్కా ఎత్తుకుని కళ్లు తుడుచుకున్నాడు.
నాన్నకు ఇప్పుడు 58 ఏళ్లు. మొన్ననే రిటైర్ అయ్యాడు. నేను కారు నేర్చుకుని... ఆ తరువాత ఇంకా ఎన్నో నేర్చుకుని అమెరికాకి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇప్పుడు నాన్నతో వాట్స్ యాప్‌లో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నాను. మొన్న నాన్న కారు ఫొటో పెట్టాడు. అన్నీ సొట్టలు! నిండా గీతలే!! ఒక లైట్ పగిలిపోయింది. ఆ సొట్టలు పడ్డ కారు పక్కన... సొట్ట బుగ్గలేసుకుని ఫుల్‌గా నవ్వుతూ అమ్మ నిలబడి ఉన్న ఫొటోని కూడా పంపించాడు నాన్న! ఆ ఫొటో కింద నాన్న మెసేజ్! ‘అమ్మకు కారు నడపడం నేనే నేర్పించా...’ ఇదీ... మా అమ్మానాన్నల సంసారం, మా అమ్మ కోసం అన్నీ వదిలేసుకుంటాడు నాన్న. నాన్నకు మా అమ్మ ఎప్పటికీ చిన్న పిల్లే. నేను ఆ వేప చెట్టు కింద పూల కుండీని.
సినిమాలో సంసారం
సైకిల్ నడపడమంటే మామూలు విషయం కాదమ్మా
రఘురామన్ (ప్రకాశ్‌రాజ్), అను(ఐశ్వర్య) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారి కూతురు అభి (త్రిష). కూతురంటే నాన్నకు పంచ ప్రాణాలు. మూడేళ్లకు అభిని స్కూల్లో చేరుద్దామని భార్య అంటే.. ‘అప్పుడే ఏంటి తొందర’ అంటూ వద్దని వారిస్తాడు. చివరకు ఎలాగో, కొంత అయిష్టంగానే సరే అంటాడు. ప్రతి రోజూ తన జీపులో కూతుర్ని ఉదయం స్కూల్‌కి తీసుకెళ్లి, సాయంత్రం తీసుకొస్తుంటాడు. తన ఫ్రెండు సైకిల్లో స్కూల్‌కి వెళుతోందని తానూ అలాగే వెళతాననీ, సైకిల్ కావాలంటుంది అభి.
కూతురి ఇష్టాన్ని అను సపోర్ట్ చేస్తే రఘురామన్ కుదరనే కుదరదు... అని మొండికేస్తాడు. అలకల తర్వాత తప్పనిసరయ్యి సైకిల్ కొనిస్తాడు. కొనిస్తాడు సరే... ఇక జాగ్రత్తల జాబితా మొదలు. ‘ఇలా చూడు అభీ.. సైకిల్ నడపడమంటే మామాలు విషయం కాదమ్మా.. రైట్కి తిరిగేటప్పుడు రైట్ హ్యాండ్, లెఫ్ట్‌కి తిరిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూపించాలి’’ అంటూ ‘జాగ్రత్తమ్మా.. జాగ్రత్తమ్మా’ అని చెప్పి పంపిస్తాడు ‘ఆకాశమంత’ చిత్రంలో!
ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి.
సాక్షి పాఠకులతో పంచుకోండి.
ఈ మెయిల్: samsaaram2017@gmail.com
– సాత్విక