సత్యం రామలింగరాజు విడుదల
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో శిక్ష ఖరారై 35 రోజులుగా శిక్ష అనుభవిస్తున్న సత్యం రామలింగరాజు బుధవారం బెయిల్పై చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్వో వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాల్కృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణరాజు, సంస్థ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్గుప్త, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం కూడా జైలునుంచి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజుల తర్వాత జైలు అధికారులకు బెయిల్ ఉత్తర్వులు అందాయి.
బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత జైలు అధికారులకు బెయిల్ ఉత్తర్వులు అందగా.. వెంటనే పని పూర్తిచేసి 6:30 గంటల సమయంలో వారిని జైలు నుంచి విడుదల చేశారు. బెయిల్ ఉత్తర్వులు రావడంలో జాప్యం వల్లే విడుదల ఆలస్యమైందని అధికారులు తెలిపారు. మరోవైపు జైలు నుంచి విడుదలైన రామలింగరాజు మీడియాకంట పడకుండా బయటకువెళ్లేందుకు జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో జైలు లోపల గేటు వరకు మీడియాను అనుమతించే అధికారులు బుధవారం మాత్రం జైలు వెలుపల గేటు వద్దే మీడియాను ఆపేశారు. రామలింగరాజు విడుదల నేపథ్యంలో ఆయన పీఏ చర్లపల్లి జైలు వద్ద హల్చల్ చేశాడు. జైలు ఆవరణలో తిరుగుతూ ఏ వాహనాన్ని లోనికి పంపాలో జైలు సిబ్బందికి సూచిస్తూ హడావుడి చేశాడు.