సముద్ర తీరప్రాంతంలో చొరబాటుదారులపై నిఘా పెరిగింది
సాక్షి, గుంటూరు: సముద్ర తీరప్రాంతంలో చొరబాటుదారులపై నిఘా పెరిగింది. సముద్ర మార్గం గుండా దేశంలో చొరబడే అరాచక శక్తుల్ని పట్టుకొనేందుకు మెరైన్ పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళిక అమలు చే స్తున్నారు. ఇటీవల శ్రీలంక నుంచి వచ్చి చేపల వేట చేస్తున్న బోటును నెల్లూరు వద్ద మెరైన్ సిబ్బంది పట్టుకున్నారు. అప్పటి నుంచి తీరప్రాంతంలో నిఘా మరింత పెంచారు. జిల్లాలో సుమారు 73 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉండగా, బాపట్ల, నిజాంపట్నంలలో మెరైన్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. వీటిల్లో 70 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.
ప్రధానంగా ఓడరేవులు, బీచ్ ఏరియాల్లో తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తీరప్రాంతంలోని కర్లపాలెం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం, బాపట్ల, రేపల్లె, సూర్యలంక తదితర ప్రాంతాల్లోని 38 గ్రామాల్లో ప్రస్తుతం చొరబాటుదారుల నియంత్రణ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో స్థానిక మత్స్యకారులతో కమిటీలు ఏర్పాటు చేసి దొంగదారుల్లో దేశంలోకి ప్రవేశించేవారిని అడ్డుకోనున్నారు.
12 చెక్ పోస్టుల ఏర్పాటుతో..
తీరప్రాంతంలో రెండు మెరైన్ పోలీస్స్టేషన్లతో పాటు ప్రాంతాల వారీగా మొత్తం 12 చోట్ల తీరంలో నిఘా
చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గుర్తించిన గ్రామాల్లో కొత్త వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు మెరైన్ సిబ్బంది తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మెరైన్ పోలీసులు సముద్రంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా మూడు బోట్లు ఉండగా, వాటిల్లో సిబ్బంది వెళ్లి అనుమానాస్పదంగా ఉన్న బోట్లను తనిఖీ చేస్తున్నారు. చేపల వేటకెళ్లిన మత్స్యకారుల నుంచి మెరైన్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈక్రమంలోనే నెల్లూరు వద్ద శ్రీలంక బోటును పట్టుకుని, అందులో ఉన్నవారిని రిమాండ్‌కు పంపారు. అప్పటి నుంచి అప్రమత్తమైన మెరైన్ పోలీసు అధికారులు సముద్ర తీరప్రాంతంలో నిఘా పెంచారు. ఆయా గ్రామాల్లో 1093 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి సమాచారాన్ని రాబడుతున్నారు.