పు.. పు.. పు... పులి
పిల్లతో కలిసి చిరుత సంచారం
గాలించినా దొరకని ఆచూకీ
వణికిపోతున్న మల్లక్కపేట
ఇంటర్వెల్ సమయం. బడి గంట మోగింది. పిల్లలంతా మూత్ర విసర్జనకు వెళ్లారు. చెట్ల పొదల మాటున ఓ భారీ ఆకారం. పక్కనే చిన్న పిల్ల. అంతే ఒకటే అరుపు. పు.. పు.. పు.. పులి. పిల్లలు చెల్లాచెదురయ్యూరు. బడి మూత పడింది. ఊరు ఉలిక్కి పడింది. పొలం గట్లు.. చెట్లూపుట్టల వెంట గాలింపులు. అందరి చేతిలో కర్రలు.
వరంగల్ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేటలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉదయం 11 గంటలకు చిరుత పులి తన పిల్లతో కన్పించింది. ఉపాద్యాయులు తరగతి గదులకు తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లయ్య, ఎస్సై వినయ్ కుమార్ సిబ్బందితో వచ్చి గాలించారు. చిరుత జాడ కన్పించలేదు. జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు చెప్పి వారు వెళ్లిపోయూరు.
అనుక్షణం.. భయం భయం
స్థానికులు కర్రలు పట్టుకుని గుంపులుగా చిరుత కోసం గాలించారు. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, కూలీలు పులి భయంతో అర్ధంతరంగా ఇళ్లకు వచ్చేశారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు. అందరిలోనూ టెన్షన్. పొరుగునే ఉన్న సీతారాంపురం శివారు చేన్లలో చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు ఆదివారం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లక్కపేటవాసుల ఆందోళన మరింతగా పెరిగింది. ఏ చిన్న అలికిడి విన్పించినా ఉలికి పడుతున్నారు.
అప్పుడూ.. ఇప్పుడూ అంతే
గతంలో గ్రామస్తులకు ఎలుగుబంటి బెడద ఉండేది. ఈ విషయం చెప్పినా అప్పట్లో అధికారులు పట్టించకోలేదు. గ్రామస్తులపై దాడి చేశాకే స్పందించారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎలుగు దాడిలో లడే శివయ్య తీవ్రంగా గాయపడిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడూ అధికారులు చిరుత విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని, ఇది తమకు ప్రాణగండంలా మారుతుందేమోనని ఠారెత్తిపోతున్నారు. త్వరగా చిరుతపులిని పట్టుకోవాలని కోరుతున్నారు.
ఊళ్లో కాపలా ఉంచాలి
చుట్టు అడవి లేకున్నా మా ఊళ్లోనే ఇలా జరుగుతోంది. అప్పట్లో ఎలుగుబంటి దాడి చేసింది. ఇప్పటికీ వాళ్లు సరిగా నడుస్తలేరు.చిరుత పులి దాడి చేస్తే ప్రాణాలు పోతయ్. ఈ భయూనికి ఒక్కరూ బయటకు రావడం లేదు. ఊళ్లో పోలీసోళ్లు కాపలా ఉండాలి.
గుడికందుల కొమురయ్య
కూలీలు ఎల్లిపోరుుండ్రు
పత్తి ఏరేందుకు వచ్చిన కూలీలు పులి భయంతో మధ్యలోనే వెళ్లిపోరుుండ్రు. గ్రామంలోని బడి బంద్ చేసిండ్రు. ఎవరి ఇల్లు చూసినా తలుపులు వేసే కన్పిస్తోంది. ఏ చిన్న చప్పుడు విన్పించినా భయమైతాంది. ఎన్ని రోజులు భయంతో ఉండాలో ఏమో.
బైయ్యా శంకరయ్య