డీఎస్సీ.. తొలి రోజు ప్రశాంతం
సమయానికంటే ముందే కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
సెంటర్లను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు, డీఈఓ
కడప ఎడ్యుకేషన్ : టెట్ కం టీఆర్టీ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శనివారం నిర్ణీత సమయానికి పరీక్ష ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఎవరూ పరీక్షకు ఆలస్యంగా రాలేదు. డీఎస్సీ మూడు రోజుల పరీక్షలో భాగంగా మొదటి రోజు సెకెండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు పరీక్ష జరిగింది. తొలి రోజు పరీక్షకు 2878 మంది అభ్యర్థులకు గాను 2557 మంది హాజరయ్యారు.
ఇందులో తెలుగు మీడియంకు సంబంధించి 2385 మంది హాజరు కావాల్సి ఉండగా 2117 మంది, ఉర్దూ మీడియంకు సంబంధించి 489 మందికి గాను 440 మంది హాజరయ్యారు. ఇందు కోసం కడపలో 12 కేంద్రాలను (నగరంలోని మున్సిపాల్ హైస్కూల్ మొయిన్, మున్సిపల్ ఉర్దూ హైస్కూల్, నిర్మల స్కూల్, శాంతినికేతన్ స్కూల్, మదర్ఇండియా స్కూల్, గురుకుల విద్యాపీఠ్, నాగార్జున హైస్కూల్, సెంయింట్ మేరీస్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, పవన్ స్కూల్, మరియాపురం సెయింట్ జోసఫ్ ఇంగ్లీస్ మీడియం హైస్కూల్, గాంధీనరగ్ స్కూల్) ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరీశీలకురాలు వనజాక్షి పరిశీలించారు. అభ్యర్థుల హాల్‌టికెట్లను, అందులోని ఫొటోలను పరిశీలించారు. డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి కూడా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. రెవిన్యూ, పోలీస్, విద్యాశాఖకు సంబంధించిన మూడు ప్రత్యేక స్వ్కాడ్ బృందాలు సైతం పరీక్షా కేంద్రాలను పరిశీలించాయి. డీఆర్ఓ సులోచన కూడా పలు సెంటర్లను పరిశీలించారు.
చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు : డీఈఓ
డీఎస్సీ కేంద్రాలలో అటు సిబ్బంది కానీ ఇటు అభ్యర్థులు కానీ చిన్నపాటి పొరపాటుకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని గాంధీనగర్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. డీఎస్సీ పరీక్ష కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామని చెప్పారు. రెండు ప్రాంతాలలో పరీక్ష వ్రాసే అభ్యర్థులకు సంబంధించిన జాబితా తమ వద్ద ఉందని తెలిపారు. ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తే క్రిమిన ల్ కేసు పెడతామని హెచ్చరించారు.
నేడు లాంగ్వేజ్ పండిట్లకు పరీక్ష
10 వతేదీన ఉదయం లాంగ్వేజ్ పండిట్లకు(తెలుగు, ఉర్ధూ, హిందీ) పరీక్ష నిర్వహించనున్నారు. 13 సెంటర్లకు గాను 3041 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు కేంద్రాల్లో 358 మంది అభ్యర్థులు రాయనున్నారు.