ఏడాదికో విషాదం
ఇది ఐదో పడవ ప్రమాదం
నిత్యం భయం గుప్పెట్లో ప్రయాణం
ఇరు రాష్ట్ర అధికారులు స్పందించాలి
సీలేరు: సీలేరు జలాశయం దిగువభాగాన ఉన్న గిరిజన గ్రామాల్లోని వారు ఏటా విషాదానికి గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి జల విద్యుత్ కేంద్రానికి సమీపంలో వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న వీరు ఓ పడవ ప్రమాదంలో కన్నీరు ఆరక ముందే మరో ప్రమాదానికి గురవుతున్నారు. కాకులు దూరని కారడవిలో.. క్రూర మృగాలతో పాటు అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య బతుకుతున్న ఆదివాసీలకు పడవ ప్రయాణమే ఆధారం. అగ్గిపెట్టి కొనాలన్నా అవతల నుంచి ఇవతలకు నాటు పడవలపై ప్రయాణం తప్పదు. రోడ్డు మార్గాన రావాలంటే వందల మైళ్లు ప్రయాణించాలి. అలా కాకుండా తొందరగా వెళ్లాలన్న ఆశతో నాటు పడవలను ఆశ్రయించి ప్రమాదాలకు గురవుతున్నారు.
ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బుధవారం కూడా ఇలాగే జరిగింది. తూర్పుగోదావరి సరిహద్దు సీలేరు నది ప్రవాహంలో ఒడిశా గిరిజనులు ప్రయాణిస్తున్న నాటు పడవ బోల్తా పడింది. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా కులమనూరు పంచాయతీకి చెందిన ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. మరో వ్యక్తి ఈత కొట్టుకొని ఒడ్డుకు చేరుకున్నాడు. ఏటా ఈ పరిస్థితిని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒక్కో పంచాయతీకి మోటారు బోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం అవి చెడిపోవడంతో గత్యంతరం లేక నాటు పడవలనే ఆశ్రయిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఈ పడవలు మునిగి 10 మందికిపైగా గిరిజనులు చనిపోయారు. ఈ పరిస్థితి నుంచి గిరిజనులు బయట పడాలంటే ఇరు రాష్ట్రాల అధికారులు ఉమ్మడిగా స్పందించి వంతెన సదుపాయం కల్పిస్తేనే తప్పా ఈ ప్రమాదాలకు స్వస్తి ఉండదన్న వాదన వ్యక్తమవుతోంది.