ఒకే నెలలో రూ.2800 కోట్ల అప్పు
సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగుల సమ్మెతో సర్కారు నడ్డి విరిగింది. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం మొత్తం ఆగిపోయింది. అటువైపు నుంచి ఒక్క రూపాయి కూడా సర్కారు ఖజానాలో జమ కావడంలేదు. దీంతో.. సెక్యురిటీల విక్రయం లాంటి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రధాన ఖజానా కార్యాలయాలతో పాటు 194 ఉప ఖజానా కార్యాలయాలూ మూతపడడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. సాధారణంగా ఈ 13 జిల్లాల నుంచి ప్రతి రోజూ రూ. 140 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేర ప్రభుత్వానికి రాబడి వస్తుంది. సమ్మెతో ఈ రాబడులు నిలిచిపోయాయి. దీంతో ఆర్థిక సంక్షోభం నెలకొనకుండా చూసేందుకు ఆర్థిక శాఖ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది.
సీమాంధ్ర జిల్లాల నుంచి ఆదాయం నిలిచిపోవడంతో ఉద్యోగులకు జీతాలు, అప్పులపై వాయిదాలు, వడ్డీ చెల్లింపులపై కష్టతరం కానున్నది. దీంతో, ఆర్థిక శాఖ ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒక్క ఆగస్టు నెలలోనే రూ.2,800 కోట్లు అప్పు చేస్తోంది. ఈ నెల 13న ప్రభుత్వ సెక్యురిటీలను విక్రయించడం ద్వారా రూ.1800 కోట్ల రుణాన్ని సేకరించింది. ఈ నెల 27న మరో రూ. వెయ్యి కోట్ల రుణ సేకరణకు సెక్యురిటీలు విక్రయించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఒక్క నెలలో రూ.1,500 కోట్లకు మించి అప్పు చేసిన సందర్భాలు ఇటీవల కాలంలో లేవు. సమ్మె దెబ్బ సర్కారు మీద గట్టిగానే పడుతోంది.