ఏది కావాలన్నా శెట్టి కొండయ్య అంగడే..
ఆయుర్వేదం.. ఆధ్యాత్మికం కేరాఫ్ శెట్టి కొండయ్య
ఆయుర్వేదానికి చిరునామాగా నిలిచిన దుకాణం
తొమ్మిది దశాబ్దాలుగా ప్రయాణం
హిమాలయాల్లో లభించే మూలికలు...హోమాల్లో ఉపయోగించే నెయ్యి...గర్భిణులు ఉపయోగించే కుంకుమ పువ్వు... పూజ సామగ్రి...రుద్రాక్షలు...ఇందులో ఏదీ కావాలన్నా...టక్కున గుర్తొచ్చేసి శెట్టి కొండయ్య దుకాణం. అనంతపురంలోని పాతూరులో ఉన్న దుకాణం జిల్లా వాసులందరికీ అంతలా సుపరిచితం అయ్యేందుకు తొమ్మిది దశాబ్ధాల చరిత్ర ఉంది. వెలకట్టలేని శ్రమ ఉంది. అంతకుమించిన సేవాభావముంది.
అనంతపురం కల్చరల్:
ఆయుర్వేదం..ప్రపంచానికి దారి చూపిన సనాతన భారతీయ వైద్య విధానం. అలోపతి..యునానీ.. హోమియో మరెన్నో వైద్య విధానాలున్నా ప్రాచీన రుషి సంప్రదాయానికి ప్రతీకగా నిలచిన ఆయుర్వేదంపై అనంత వాసులకు విశ్వాసం ఎక్కువే. అందుకు జిల్లా కేంద్రంలోని ‘శెట్టి కొండయ్య దుకాణం’ కూడా ఓ కారణమంటే అతిశయోక్తి కాదు.
పండితుల వద్ద అవగాహన
పాతూరు సందుల్లో దాదాపు తొంబై ఏళ్ల కిందట వెంకట నారప్ప అనే వ్యక్తి చిన్నదుకాణంలో ఆయుర్వేద మూలికల అంగడి ప్రారంభించాడు. స్థానికంగా దొరికే మూలికలతో వ్యాపారం కొనసాగించేవాడు. కానీ ఆయన కుమారుడు శెట్టి కొండయ్య వ్యాపారంలో అడుగిడాక అది మూడు పువ్వులు..ఆరు కాయలుగా విరాజిల్లింది. వినియోగదారులకు ఏం కావాలో...అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరీ శెట్టి కొండయ్య తెప్పించేవాడు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, కలకత్తా ప్రాంతాలకెళ్లి ఆయుర్వేద మూలికలను తెచ్చేవారు. అయితే మనుషుల ఆరోగ్యంతో ఆషామాషీ వ్యవహారం కాదు కాబట్టి ఆయనే స్వయంగా ఏ రోగానికి ఏ మూలిక పనిచేస్తుందే నేర్చుకుని మరీ అమ్మేవారు. ఆ రోజుల్లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడంతో...జనమంతా ఇంటి వైద్యమైన ఆయుర్వేదంపై ఆధారపడేవారు. అందుకే ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా జిల్లా వాసులంతా శెట్టి కొండయ్య దగ్గరకు వచ్చేవారు. అలా అందరి వద్ద నమ్మకం సంపాదించిన శెట్టి కొండయ్య తన పేరునే బ్రాండ్ నేమ్గా మార్చుకుని వ్యాపారాన్ని విస్తరించాడు. అలా ఆయూర్వేద మూలికలకు చిరునామాగా మారిన శెట్టి కొండయ్య దుకాణంలో మంతెన సత్యనారాయణ, ఏల్చూరి వంటి ఆయుర్వేద పండితులు చెపుతున్న చూర్ణాల, వివిధ గింజలు, లవణాలు, పొడులు, వన మూలికలేవైనా సిద్ధంగా ఉంటాయి.
పూజ సామగ్రికీ పెట్టింది పేరు
సంప్రదాయ పూజా సామగ్రి విషయంలోనూ శెట్టి కొండయ్య దుకాణం పేరుగాంచిందనే చెప్పవచ్చు. వేద పురోహితులు, అర్చకులు యజ్ఞ, యాగాదుల కోసం ఉపయోగించే వస్తు సామగ్రి దొరకడం కూడా అతి కష్టమైన రోజుల్లోనూ శెట్టి కొండయ్య వాటి కోసం రాష్ట్రంలోని సుప్రసిద్ధ ప్రాంతాలన్నింటి తిరిగి సేకరించేవాడు. ఒక్కోసారి హిమాలయాల్లో మాత్రమే దొరికే పూసలు, రుద్రాక్షలు, సముద్రపు గవ్వలు, కుంకుమ, పసుపు, గంధం, కర్పూరాలను తీసుకువచ్చి వినియోగదారులకోసం సిద్ధంగా ఉంచేవాడు. అలాగే యజ్ఞోపవితాలు, రాగి, వెండి రేకులపై లిఖించే బీజాక్షరాల వంటి వాటిని సేకరించడానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చేవారు. పండుగలొచ్చినా, నిత్య దీపధూప నైవేద్యాలకైనా అవసరమయ్యే వస్తు సామగ్రిని అనంతకు పరిచయం చేయడానికి పెద్ద తతంగమే జరిగింది. మరోచోట కొని తెచ్చి అమ్మడం కన్నా అరుదైన వాటిని సేకరించి అమ్మడం వల్ల ఎక్కువ విశ్వాసం ఉండేది. కాబట్టే ఒకనాడు పాతూరుకు పరిమితమైన వ్యాపారం జిల్లా అంతటా పాకిపోయింది. ఆ క్రమంలోనే శెట్టి కొండయ్య దుకాణం ఇపుడు రాష్ట్ర మంతటా పేరుగాంచింది.
వారసుల కాలంలో మరింత వృద్ధిలోకి...
శెట్టి కొండయ్యకు మగ సంతానం లేకపోవడం... ఆయన 1986లో మృత్యువాత పడడంతో దుకాణంలో గుమాస్తాగా పనిచేసే శెట్టికొండయ్య భార్య అన్నకొడుకైన సుబ్రమణ్యం వ్యాపారాన్ని కొనసాగించారు. ఆ తర్వాత సుబ్రమణ్యం కుటుంబీకులే దానిని నిర్వహిస్తున్నారు. శెట్టి కొండయ్య కూతుళ్లయిన తులసమ్మ, విశాలాక్షి ఇద్దరూ ప్రస్తుతం తాడిపత్రి ప్రాంతంలో నివసిస్తున్నారు. శెట్టి కొండయ్య నేర్పిన పాఠాలతో ఇప్పటి వారసులు కూడా ప్రజా సంబంధాలకు, విలువలకు ప్రాధాన్యతనిస్తుండడంతో వ్యాపారం మరింత వృద్ధి చెందింది. ఇటీవల కాలంలో ఆయుర్వేదానికి మంచి రోజులు వస్తుండడం, ఆధ్యాత్మిక పరంపర పెరిగి పూజలు, హోమాలు, యజ్ఞ యాగాలకు పూర్వ వైభవం రావడంతో శెట్టి కొండయ్య దుకాణం నిత్యం వినియోగదారులతో కిటకిటలాడుతూనే ఉంటుంది.
నాణ్యత, నిబద్ధతే మా విజయ రహస్యం
నేను 1986లో చిన్న గుమాస్తాగా చేరాను. శెట్టి కొండయ్య కాలం చేసినప్పటి నుంచీ నేనే అంగడి నడుపుతున్నాను. ‘కస్టమర్లే మనకు దేవుళ్లు..వారిని బాగా చూసుకుంటే జీవితంలో ఏ లోటూ రాదు’ అని మాకు చిన్నప్పటి నుండి కొండయ్య చెప్పేవాడు. చిన్న పొరపాటు జరిగినా సహించేవాడు కాదు. ఆ మేరకు మేము కూడా నాణ్యమైన వాటినే విక్రయిస్తూ వస్తున్నాం. కాబట్టే ఆయన పేరు పాతూరులో చిరస్థాయిగా నిలచిపోయింది.
– సుబ్రమణ్యం, నిర్వాహకులు, శెట్టికొండయ్య దుకాణం
యాభై ఏళ్లుగా అదే నమ్మకం
మేము యాభై ఏళ్ల నుంచి శెట్టి కొండయ్య అంగడిని చూస్తున్నాం. ఏ మూలిక కావాల్సి వచ్చినా శెట్టికొండయ్య వాళ్ల దగ్గరకు వెళ్లేవాళ్లం. ఆయన ప్రేరణతో చాలా దుకాణాలు వచ్చినా నాణ్యతతో పాటు కచ్చితత్వం ఉంటుందని మాలాంటి వారమంతా శెట్టి కొండయ్య దుకాణికే వెెళ్తాం. ఒక్కోసారి ఏదైనా వస్తువు వారి వద్ద లేకున్నా..దాని రవాణాకు ఎంత ఖర్చయినా సొంతంగా భరించి వినియోగదారునికి అందిస్తారు. ఇక కొండయ్య ఉన్నరోజుల్లో చదువుకునే పిల్లలను పిలిచి మరీ శొంఠి ఉచితంగా ఇచ్చేవాడు. దాన ధర్మాలంటే ఎంతో ప్రీతి కనపరిచేవాడు.
– సయ్యద్ షేక్షావలి, టైలర్, పాతూరు
ఆధ్యాత్మిక సామగ్రి అందుబాటులో ఉంటుంది
మా చిన్నప్పుడు పూజా సామగ్రిని స్వయంగా సమకూర్చునే వాళ్లం. ఆ ఓపికి ఈ తరం వారికి తగ్గిపోయింది. ఏది కావాలన్నా రెడీమెడ్పైన ఆధారపడుతున్నారు. అందుకే ఎంత పెద్ద హోమమైనా, యజ్ఞమైనా పూజా సామగ్రి కోసం శెట్టి కొండయ్యదుకాణానికే వెళ్తున్నారు. మేము నిత్యం ఉపయోగించే వనమూలికలైనా, వివిధ ఆధ్యాత్మిక సామగ్రి అయినా ఇబ్బంది లేకుండా అక్కడ అందుబాటులో ఉంటుంది.
– ఏఎల్ఎన్ శాస్త్రి, వేదపండితులు, అనంతపురం