స్వాతంత్య్ర సమరయోధుడి మృతి
ఉప్లూర్ (కమ్మర్పల్లి), న్యూస్‌లైన్:
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పోతు రాజేశ్వర్(89) శనివారం సాయంత్రం అనారోగ్యంతో మరణించాడు. రాజేశ్వర్ 1925, ఆగస్టు 18న జన్మించారు. స్వాతంత్య్ర పోరాటంలో 1942-1953 మధ్య ముంబ యి సేవాదళ్ కార్యకర్తగా ఆయన పనిచేశారు. ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని జైలుకు సైతం వెళ్లారు. 1947, మే 22న బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొని అరెస్టై వారం పాటు జైల్లో ఉన్నారు.1953లో ముంబయి నుంచి స్వగ్రామం ఉప్లూర్‌కు వచ్చి స్థిరపడ్డారు.1965-1970 మధ్య గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.
నిత్యం ఖద్దరు దుస్తులు ధరించి, తలపై ఖద్దరు టోపీ ధరించే రాజేశ్వర్ సాత్వికాహారం తీసుకునేవారు. ఆధ్యాత్మిక చింతన, గాంధేయవాదాన్ని అనుసరించేవారు. ఒంటిపూట భోజనం, ఉదయం పచ్చి పాలు తాగడం ఆయన అలవాటని, అందుకే ఇన్నేళ్లు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బతికారని కుటుంబసభ్యులు తెలిపారు. రాజేశ్వర్ నెలక్రితం ఇంట్లో జారిపడగా తుంటి ఎముక విరిగింది. జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించగా ఇన్ఫెక్షన్ ఎక్కువై శరీర అవయవాలపై ప్రభావం పడింది. దీంతో ఆయన పది రోజులుగా. అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
ప్రభుత్వ ఆదరణ కరువు...
స్వాతంత్య్ర సమరయోధుడైన రాజేశ్వర్‌కు ప్రభుత్వ ఆదరణ కరువైంది. స్వాతంత్య్ర సమరయోధుల జాబితాలో ఉన్నప్పటికీ పింఛన్ సౌకర్యం కల్పించలేదు. పింఛన్, ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నటికైన ప్రభుత్వం తనను గుర్తించక పోతదా అని అనుకుంటూ కోరిక నెరవేకుండానే రాజేశ్వర్ లోకాన్ని విడిచి వెళ్లారు.